Begin typing your search above and press return to search.

బిగ్‌ బ్రేకింగ్: బాబుపై నాన్ బెయిల‌బుల్ వారెంట్‌

By:  Tupaki Desk   |   13 Sep 2018 4:59 PM GMT
బిగ్‌ బ్రేకింగ్: బాబుపై నాన్ బెయిల‌బుల్ వారెంట్‌
X
తెలుగు రాష్ర్టాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయింది. బాబ్లీ కేసులో చంద్రబాబుతో సహా 15 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పెండింగ్‌ లో ఉన్న నాన్ బెయిల్ వారెంట్‌ లో ఈనెల 21న ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై న్యాయనిపుణుల సలహా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21న ధర్మాబాద్ కోర్టు ముందు హజరుకావాలని ఆదేశించడంతో ఏమి చేయాలన్న దాని పై పార్టీ సీనియర్లు కసరత్తు మొదలుపెట్టారు.

గోదావరి పై మహరాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు వెళ్లారు. ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయినా బాబ్లీ ప్రాజెక్టు సందర్శించిన తరువాతే వెళ్తామని పట్టుపట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి బెయిల్ తీసుకోవాల్సిందిగా కోరారు. దీనికి చంద్రబాబు నిరాకరించడంతో విమానంలో హైదరాబాద్ కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అమలులో ఉన్నా పట్టించుకోకపోవడం - వంటి కారణలతో చంద్రబాబు పై కేసు నమోదయ్యాయి. ఇటీవలే చంద్రబాబు కోర్టుకు హజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు అమలుకావడం లేదంటూ పిటీషన్ వేశారు. దీంతో మళ్లీ బాబ్లీ కేసు తెరపైకి వచ్చింది. కాగా ఈ ప‌రిణామాన్ని ఎలా డీల్ చేయాల‌నే విష‌యంలో టీడీపీ శ్రేణులు చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో మునిగిపోయాయి.

మ‌రోవైపు ఈ నోటీసుల గురించి ముందే తెలుసు అన్న‌ట్లుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఉదయం అమరావతిలో లోకేష్ మీడియాతో మాట్లాడుతూ - బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులిస్తే ధర్మాబాద్ కోర్టుకు వెళ్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అధినేత - ఎమ్మెల్యేలు పోరాడారని.. అరెస్టులు జరిగినా వెనక్కి తగ్గలేదన్నారు. బాబు బెయిల్ తిరస్కరించిన విషయాన్ని కూడా లోకేష్ గుర్తు చేశారు. అయితే అప్పట్లోనే కేసును ఉపసంహరించుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పుడు తిరిగి తెరమీదకు రావడం ఏంట‌ని ప్ర‌శ్నించారు.