Begin typing your search above and press return to search.

ఆ అధికారి ఆస్తులు రూ.100 కోట్లపైనేనట..

By:  Tupaki Desk   |   7 Nov 2019 4:43 AM GMT
ఆ అధికారి ఆస్తులు రూ.100 కోట్లపైనేనట..
X
అతనో చిరుద్యోగి. అంచలంచెలుగా ఎదిగాడు. పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ లో చేసిన మురళీగౌడ్ ఇప్పుడు విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలకు చెందిన ఇతగాడి ఇంటి మీదా.. అతడి బంధువులు.. స్నేహితులు.. పరిచయస్తుల ఇళ్ల మీద ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో షాకింగ్ నిజాలు బయటకు రావటమే కాదు.. అతడికున్న ఆస్తుల లెక్కకు విస్మయానికి గురవుతున్నారు.

ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం మురళీగౌడ్ ఆస్తి ఏకంగా రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. కర్ణాటక) ఉన్న ఆస్తుల్ని లెక్క తీస్తున్న అధికారులు ఆశ్చర్యపోయేలా పోగేసి ఆస్తులు చూస్తే.. ఒక ఉద్యోగి స్వల్పవ్యవధిలో ఇంత భారీగా కూడబెట్టటమా? అన్న సందేహం కలుగక మానదు.

నంద్యాల.. తిరుపతి.. బెంగళూరు.. హైదరాబాద్.. విజయవాడలలోని మొత్తం ఆరు బ్యాచులు వేర్వేరుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నంద్యాల పురపాలక శాఖలో కెరీర్ స్టార్ట్ చేసిన మురళీగౌడ్ తర్వాతి కాలంలో అంచలంచెలుగా ఎదిగాడు. వివిధ విభాగాల్లో పని చేశాడు.చివరకు తిరుపతిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా పని చేశాడు. ఆ సమయంలో ఆయనపైన విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.

అయినా అతను వెనక్కి తగ్గలేదు. 2014లోవిజయవాడలోని సీఆర్డీఏకు డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయన.. వారం క్రితం విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో అతని మీద ఉన్నకంప్లైంట్ల మీద స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తున్న ఆస్తుల చిట్టాతో ఏసీబీ అధికారులే అవాక్కు అవుతున్నారు.

నగదు.. బంగారం.. ఇళ్లు.. స్థలాలు.. ఇలాఒకటేమిటి? డబ్బును ఎన్ని విధానాలుగా మదుపు చేయాలో అన్ని రకాలుగా మదుపు చేయటం ఒక ఎత్తు అయితే కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు.. తెలిసిన వారి దగ్గర కూడా తాను దోచుకున్న డబ్బును దాచిపెట్టినట్లుగా గుర్తించారు. బుధవారం మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అంచనా ప్రకారం మురళీ గౌడ్ ఆస్తులు రూ.100 కోట్లకు పైనే ఉంటాయని.. ఫైనల్ ఫిగర్ చివర్లో చెబుతామంటున్నారు.