Begin typing your search above and press return to search.

ఏపీకి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

By:  Tupaki Desk   |   9 Nov 2019 6:48 AM GMT
ఏపీకి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
X
తెలంగాణకు లేనిది.. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న గొప్ప వరం ఏంటో తెలుసా.. సముద్ర తీరం.. అందులోని అపార నిక్షేపాలు. ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చేలా కనిపిస్తోంది. ఏపీ గుండా ప్రవహించే కృష్ణా-గోదావరి నదుల బేసిన్ లో అపార చమురు, గ్యాస్ నిక్షేపాలున్నట్టు ఇప్పటికే ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థలు నిగ్గుతేల్చాయి. వెలికితీతకు ప్లాంట్లను ఏర్పాటు చేశాయి.. ఇంకా ఎంతో అపార నిల్వలు ఉన్న ఏపీకి ఇప్పుడు ఉజ్వల భవిష్యత్ ఉందని అంటున్నారు కేంద్ర పెట్రోలియ, సహజ వనరులు, స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తాజాగా ఏపీ సీఎం జగన్ తో అమరావతిలో భేటి అయిన ఈ మేరకు ఏపీకి రాబోయే రోజుల్లో పెట్టుబడుల వరద ఖాయమని ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్రోలియం దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర చెప్పుకొచ్చారు. కృష్ణా-గోదావరి బేసిన్ లోని అపార చమురు, గ్యాస్ నిక్షేపాలతో ఏపీకి పెట్టుబడుల వరద ఖాయమని అన్నారు. ఇప్పటికే ఈ గ్యాస్ వెలికి తీయడానికి ప్రపంచ పెట్రోలియం దిగ్గజ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ధర్మేంద్ర చెప్పుకొచ్చారు.

కడపలోని ఇనుము ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను ఎన్ఎండీసీ నుంచి సరఫరా చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ అభ్యర్థనకు స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఎండీసీ దీనిపై ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలోని గ్యాస్ వెలికితీసే ఓఎన్.జీసీ వల్ల ఎఫెక్ట్ అయిన 16554 మంది మత్స్యకారులకు రావాల్సిన పరిహారం 81 కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రి ప్రధాన్ వాటిని వెంటనే విడుదల చేయాలని ఓఎన్.జీసీ అధికారులను ఆదేశించారు.

ఏపీ సముద్ర తీరంలో చమురు, గ్యాస్ వెలికి తీత వల్ల పాడయ్యే పర్యావరణం, చేపల వృద్ధి తగ్గిపోతుందని.. దానికి నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ కేంద్రమంత్రికి విన్నవించారు. విభజన చట్టంలో హామీనిచ్చినట్టు కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ ముడి చమురు శుద్దికర్మాగారం, పెట్రో కెమికల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. కాకినాడలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విన్నవించారు.