Begin typing your search above and press return to search.

అవినీతి చేయని ఎమ్మెల్యే ఎలా ఉంటాడో తెలుసా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 9:01 AM GMT
అవినీతి చేయని ఎమ్మెల్యే ఎలా ఉంటాడో తెలుసా?
X
ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి.. నలగని ఖద్దరు చొక్కా, మిలమిలా మెరిసే బూట్లూ - కళ్లకు నల్లటి కళ్లజోడు - చేతికి బంగారు ఉంగరాలు - మెడలో చైను - ఖరీదైన వాచ్ - సెల్ ఫోన్.. ఇలా అబ్బో ఆ రేంజే వేరు. జీవితంలో ఒక్కసారైన ఎమ్మెల్యే కావాలని కలలుకనే వారు ఎందరో ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆ ప్రజాప్రతినిధి రూపు రేఖలు సమూలంగా మారిపోతాయి. మనవలు - మునిమనవలు బతికేంత సంపాందించుకోవచ్చు.. ఇప్పుడు సమాజంలో రాజకీయాలను అవినీతిని వేరు చేయలేం. నేతలంతా అవినీతితో పంకిలమైనవారే.. ఒక్క సారి ఎమ్మెల్యే అయితే చాలు.. వారి మొత్తం ఆస్తిపాస్తులు పెరిగిపోతాయి.. ఖరీదైన భోజనం - విందులు - వినోదాలు -విలాసాలు.. వసతులు ఇలా ఉంటుంది ఎమ్మెల్యే జీవితం..

కానీ ఈయన వేరు.. ఎమ్మెల్యేలందరిలోకి పూర్తిగా డిఫెరెంట్. ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంత సింపుల్ గా ఉన్న వైనం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయక మానదు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్య తెల్లచొక్కా - కింద పంచెతో అచ్చం ఓ పేద రైతులా వచ్చి హైదరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు కోసం వేచి ఉన్న ఫొటో వైరల్ గా మారింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఈయనేనా అని అందరూ ఆశ్యర్య పోయారు.

గుమ్మడి నర్సయ్య. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం నుంచి 1983 - 1985 - 1989 - 1999 - 2004లో ఐదుసార్లు గెలిచి రికార్డ్ సృష్టించాడు. 2009లో ఇండిపెండెంట్ గా గెలిచాడు. అవినీతి - ఆశ్రిత పక్ష పాతానికి దూరంగా నీతిగా - నిజాయితీ గా ప్రజా సేవ చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సైకిల్ పై గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవడం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజల మనిషి గా పేరు తెచ్చుకున్నాడు.

ఎంతో నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన నర్సయ్య తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో సాదా సీదాగా బస్సు కోసం ఎదురు చూస్తూ కనిపించారు. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఉన్న ఈయన రాజకీయాల్లో సేవ చేయడం తప్పితే ఏం సంపాదించుకోలేదు. అందుకే ఇలా మిగిలి పోయారు.. ఎంత ఎత్తుకు ఎదిగినా సాదాసీదా జీవితం గడుపుతున్న నర్సయ్య జీవనం నిజంగా నేటి ప్రజా ప్రతినిధులకు నిజంగా స్ఫూర్తిదాయకం.