Begin typing your search above and press return to search.

కేసీఆర్, నితీష్‌ల‌కు పీకే షాక్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   12 Sep 2022 5:46 AM GMT
కేసీఆర్, నితీష్‌ల‌కు పీకే షాక్ మామూలుగా లేదుగా!
X
2024లో జ‌రిగే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించి తాము అధికారంలోకి రావాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌లంగా భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మొద‌టి నుంచి టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కాలికి బ‌ల‌పం కట్టుకుని వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశాలు జ‌రుపుతున్నారు. బీజేపీ ముక్త భార‌త్‌కు త‌న‌తో క‌ల‌సి రావాల‌ని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ బాట‌లో జేడీయూ అధినేత‌, బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ చేరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కూడా ఢిల్లీలో వివిధ పార్టీల నేత‌ల‌ను, వివిధ రాష్ట్రాల సీఎంల‌తో భేటీ అవుతున్నారు. బీజేపీ ర‌హిత ప్ర‌భుత్వ ఏర్పాటుకు క‌ల‌సి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.

అయితే ప్ర‌తిప‌క్ష నేత‌ల భేటీల‌పై ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ భేటీల వ‌ల్ల ఎలాంటి ప్రయోజ‌నం ఉండ‌ద‌ని తేల్చిచెప్పారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆమోదం పొందాలంటే ప్ర‌తిప‌క్షాల కూట‌మికి విశ్వ‌స‌నీయ‌మైన నాయ‌కుడిగా ఎంచుకోవాల‌ని సూచించారు. అంతేకాకుండా ప్ర‌జా ఉద్య‌మం తీసుకురావాల్సి ఉంద‌న్నారు. విశ్వ‌స‌నీయ‌మైన నాయ‌కుడిని ఎంచుకోకుండా, ప్ర‌జా ఉద్య‌మం నిర్మించ‌కుండా ఉత్తుత్తి భేటీలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని ప్ర‌శాంత్ కిశోర్ బాంబు పేల్చారు.

ప్ర‌స్తుతం కేసీఆర్‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాగే నితీష్ కుమార్ కు చెందిన జేడీయూకు గ‌తంలో ప్ర‌శాంత్ కిశోర్ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ ఉన్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన విభేదాలతో జేడీయూ నుంచి ప్ర‌శాంత్ కిశోర్ ను నితీష్ దూరం పెట్టారు.

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్, జ‌గన్‌కు వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి ప్ర‌శాంత్ కిశోర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌తిప‌క్షాల స‌మావేశాలు వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశం లేద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్, నితీష్ కుమార్, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇత‌ర పార్టీల నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ ప్ర‌ధాని పీఠంపై క‌న్నేసిన సంగ‌తి విదిత‌మే. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ కిషోర్ ఈ భేటీల‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నం తేల్చిచెప్ప‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తిప‌క్షాలు అన్నీ స‌మావేశ‌మైనంత మాత్రాన అవ‌న్నీ క‌ల‌సిపోతాయ‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని ప్ర‌శాంత్ కిశోర్ అంటున్నారు. దాన్ని స‌రికొత్త రాజ‌కీయ ప‌రిణామంగా చూడాల్సిన అవ‌సరం లేద‌ని చెబుతున్నారు. ఈ భేటీలతో క్షేత్ర స్థాయిలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులేమీ మారిపోవ‌ని తెలిపారు. ప్రజా ఉద్య‌మాన్ని నిర్మించి.. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నాయ‌కుడిని ముందుకు తెస్తేనే ప్ర‌జ‌ల్లో ఆమోదం ల‌భిస్తుంద‌ని ప్ర‌శాంత్ కిశోర్ తేల్చిచెబుతున్నారు. ఆ నాయ‌కుడు బీజేపీకి ప్ర‌త్యామ్నాయం కాగ‌ల‌డ‌ని ప్ర‌జ‌ల‌కు అనిపించాల‌ని చెప్పారు. అప్పుడే ఆ కూట‌మికి ప్ర‌జ‌లు ఓట్లేస్తార‌ని తేల్చిచెప్పారు.

ఇక కాంగ్రెస్ నుంచి గ‌త తొమ్మిదేళ్ల నుంచి త‌డ‌బ‌డుతోంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నారు. వ‌రుస సంక్షోభాలు ఆ పార్టీని కుదేలు చేస్తున్నాయ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ విఫ‌లం కావ‌డం వ‌ల్లే ఆమ్ ఆద్మీ, టీఆర్ఎస్, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచాయ‌ని ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ను ప‌క్క‌న‌పెట్టి ఈ పార్టీల నేత‌లు బీజేపీకి స‌రైన ప్ర‌త్యామ్నాయం తామేన‌ని చెప్పుకుంటున్నార‌ని ప్ర‌శాంత్ కిషోర్ చెబుతున్నారు.

కాగా ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా మీరు ఎవ‌రిని ఎంచుకుంటార‌ని ప్ర‌శాంత్ కిషోర్ ను మీడియా ప్ర‌శ్నించ‌గా ఆయ‌న తెలివిగా జ‌వాబు దాటేశారు. అంద‌రికీ విశ్వ‌స‌నీయ‌మైన వ్య‌క్తే ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తి అని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాని ప‌ద‌వికి.. కేసీఆర్, మ‌మ‌తా బెన‌ర్జీ, కేజ్రీవాల్ ఎవ‌రు బెస్ట్ అనేదానికి ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.