Begin typing your search above and press return to search.

వేలంలో అమ్ముడుపోని ఈ ఆటగాడే.. ఐపీఎల్ లో మెరిసాడు

By:  Tupaki Desk   |   25 May 2022 3:30 PM GMT
వేలంలో అమ్ముడుపోని ఈ ఆటగాడే.. ఐపీఎల్ లో మెరిసాడు
X
గుజరాత్ టైటాన్స్ గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఐపీఎల్-2022 ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇది గుజరాత్ టైటాన్స్ యొక్క తొలి సీజన్. మొదటి సీజన్‌లోనే ఏకంగా ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది..

గత రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. చివరి ఓవర్‌లో గుజరాత్ కు 16 పరుగులు కావాలి. ఈ అసాధ్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సుసాధ్యం చేశాడు. మొదటి మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మూడు బంతులు మిగిలి ఉండగానే తన జట్టుకు విజయాన్ని అందించాడు.

అతను 38 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు. విశేషం ఏంటంటే .. ఇతడు ఐపీఎల్ కు ముందు నిర్వహించిన 2022 -మెగా వేలం సందర్భంగా అమ్ముడుపోలేదు. ఇతడి ఫాం బాగోలేదని ఎవరూ కొనలేదు. గత సీజన్ లో పంజాబ్ కు ఆడిన ఇతడిని ఆ జట్టు కూడా తీసుకోలేదు. వేలంలో అమ్ముడుపోని మిల్లర్ ఇప్పుడు గుజరాత్ పాలిట వరంగా మారాడు.

రూ.2 కోట్ల బేస్ ధరకు అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. దీంతో అతను తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చివరకు గుజరాత్‌ మరో రౌండ్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్ లో మిల్లర్ సత్తా చాటాడు. ఏకంగా ఈసీజన్ లో 449 పరుగులతో తన జట్టు తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

అతనే కాదు.. మెగా వేలంలో వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్‌లు కూడా తొలి రౌండ్‌లోనే అమ్ముడుపోలేదు. కానీ వీరిని కూడా గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అదే గుజరాత్ కు వరమైంది. ఈ అమ్ముడుపోని ఆటగాళ్లే కసిగా ఆడి ఆ జట్టును ఫైనల్ కు చేర్చారు. కీలకమైన మ్యాచుల్లో తమ విలువైన ఆటను ఆడి గుజరాత్ ను ముందు నిలిపారు. గత రాత్రి రాజస్థాన్ తో మ్యాచ్ లో మాథ్యూ వేడ్ 30 బంతుల్లో 35 పరుగులు చేయగా.. వృద్ధిమాన్ సాహా జట్టు తరఫున ఆడిన 10 మ్యాచ్‌ల్లో 310 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

మే 29న జరిగే ఫైనల్లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఏదో గెలిచిన జట్టుతో ఫైనల్ లో గుజరాత్‌తో తలపడనుంది.