Begin typing your search above and press return to search.

వావ్!!.. ఇండియా వాళ్లు లేనిదే అమెరికా లేదా?

By:  Tupaki Desk   |   30 Nov 2021 7:39 AM GMT
వావ్!!.. ఇండియా వాళ్లు లేనిదే అమెరికా లేదా?
X
భారతీయుడి సత్తా ప్రపంచానికి తెలుస్తోంది. మనోళ్ల ప్రతిభకు ప్రపంచమే దాసోహమవుతోంది. ఇప్పటికే అనేక ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలను ఏలుతున్న భారతీయ సంతతి చేతిలోకి ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ వచ్చి చేరింది. అంతర్జాతీయ సంస్థ ట్విట్టర్ పగ్గాలు మన భారతీయుడైన పరాగ్ అగర్వాల్ కు దక్కాయి. దీంతో పరాగ్ పై భారత్ సహా ఇతరదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సైతం తాజాగా ట్విట్టర్ లో స్పందించడం విశేషం. ‘భారతీయ ప్రతిభావంతుల నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందుతోంది’ అని ఎలన్ మస్క్ రీట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తాజాగా సీఈవోగా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ ను నియమించిన సంగతి తెలిసిందే. సీఈవోగా ఇప్పటివరకూ ఉన్న కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం తన పదవి నుంచి దిగిపోవడంతో ఆయన స్థానంలో భారతీయుడైన ఐటీ నిపుణుడు పరాగ్ అగర్వాల్ ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా నియమించింది.

2006 నుంచి జాక్ డోర్సే ట్విట్టర్ సారథిగా కొనసాగుతున్నారు. తాజాగా ఈ అత్యున్నత సోషల్ మీడియాకు పరాగ్ సీఈవో అయ్యారు. ఇది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణిస్తున్నారు.

ట్విట్టర్ సీఈవోగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందింది అంటూ టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు.

గూగుల్ , మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ ట్వీట్ కు ఆయన సమాధానమిచ్చారు.

గూగుల్ కంపెనీ అల్ఫాబెట్కు సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ యూఎస్ టెక్ సంస్థ ట్విట్టర్ కు పరాగ్ అగర్వాల్ నియామకంతో అత్యంత ప్రతిభావంతుడిని ట్విట్టర్ ఎంచుకుందని ఎలన్ మస్క్ కొనియాడారు.

కాగా ఎలన్ మస్క్ ట్వీట్ పై చాలా మంది స్పందిస్తూ రీట్వీట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని కొనియాడుతున్నారు.

ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థకు చెన్నైకి చెందిన సుందర్ పిచ్చాయ్ చాలా ఏళ్లుగా సీఈవోగా కొనసాగుతున్నారు. తెలుగువాడైన సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను నడిపిస్తున్నాడు. ఇక వీరే కాదు.. ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్, పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా ఇలా మరెన్నో ప్రఖ్యాత దిగ్గజ సంస్థలను భారతీయులే నడిపిస్తుండడం విశేషం.

ఇలా ప్రపంచ టెక్నాలజీ మొత్తం భారత్ దాసోహమవుతోంది. భారతీయుల ప్రతిభకు దిగ్గజ సంస్థలు దిగివస్తున్నాయి. పట్టం కడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత మల్టీ నేషనల్ కంపెనీలను నడిపిస్తున్నది మన భారతీయులు కావడం విశేషం. భారత సంతతికి చెందిన వాళ్లే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ తోపాటు తాజాగా ట్విట్టర్ కు సీఈవోగా నియామకం కావడం గర్వకారణంగా చెప్పొచ్చు.