Begin typing your search above and press return to search.

సోముకు క‌లిసి రాని అధ్య‌క్ష పీఠం.. ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   7 Jan 2021 2:26 PM GMT
సోముకు క‌లిసి రాని అధ్య‌క్ష పీఠం.. ఏం జ‌రుగుతోందంటే!
X
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు కాలం క‌లిసి రావ‌డంలేదా? ఆయ‌న అనుకున్న విధంగా పార్టీ పుం జుకోవ‌డం లేదా? అంద‌రిదీ త‌లో దారి త‌నొక్క‌డిదీ మ‌రో దారి అన్న‌ట్టుగా పార్టీ ప‌రిస్థితి ఉందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా సోము వీర్రాజు ప‌నిచేస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తి విష‌యంలోనూ దూకుడుగా ఉంటున్నారు. పార్టీ పగ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఒకింత త‌డ‌బ‌డినా.. ఇప్పుడు మాత్రం స‌రైన దారిలోనే న‌డుస్తున్నారు.

ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసుకునేందుకు, ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ వాదిగా.. బీజేపీని ముందుకు న‌డిపించేం దుకు ఉన్న అన్ని మార్గాల‌ను సోము వీర్రాజు వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు అందివ‌చ్చిన అద్భుత అవ‌కాశం దేవాల‌యాల‌పై దాడులు. అంత‌ర్వేదిలో ర‌థం ద‌గ్ధం ఘ‌ట‌న నుంచి ప్ర‌స్తుతం రామ‌తీర్థం ఘ‌ట‌న వ‌ర‌కు కూడా దేన్నీ వ‌ద‌ల‌కుండానే సోము వీర్రాజు త‌న పార్టీకి అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. నేత‌ల‌ను కూడ‌గ‌ట్టి.. యాత్ర ల‌కు సైతం రెడీ అయ్యారు. అదేస‌మ‌యంలో త‌మ పొత్తు పార్టీ జ‌న‌సేన‌తోనూ క‌లిసి ముందుకు సాగుతున్నారు.

గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. బీజేపీ పుంజుకునేందుకు ఇంత‌టి అవ‌కాశం రాలేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో సోము దూకుడు చూపిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అనుకున్న విధంగా పార్టీకి మైలేజీ రావ‌డం లేదు. పైగా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో బీజేపీ సార‌థ్య బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన‌.. బండి సంజ‌య్ దూకు డుతో పోలిస్తే.. సోము వీర్రాజు వెనుక‌బ‌డ్డార‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఏపీ బీజేపీలో గ్రూపులు, గ్రూపు రాజ‌కీయాలు ఎక్కువ‌. ఒక‌ప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంక‌య్య నాయుడుకు ఇక్క‌డ ఒక ప్ర‌త్యేక గ్రూపు ఉండేది. ప్ర‌స్తుతం ఆయ‌న ఉప రాష్ట్ర ప‌తి అయ్యారు.

అయిన‌ప్ప‌టికీ.. ఈ గ్రూపు ఎవ‌రితోనూ క‌ల‌వ‌డం లేదు. పోనీ.. త‌మంత‌ట‌తామైనా.. పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తోందా? అంటే.. అది కూడా లేదు. దీంతో ఇలాంటి వారిని క‌లుపుకొని పోవ‌డం సోముకు త‌ల‌కు మించి న భారంగా మారింది. మ‌రోవైపు తెలంగాణ‌లో బండి సంజ‌య్ ఫైర్ బ్రాండ్‌గా మారి.. అక్క‌డి స‌ర్కారుకు చుక్క‌లు చూపిస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం అంత దూకుడు సోము చూపించ‌లేక పోతున్నారు. అంద‌రినీ క‌లుపుకొని కూడా పోలేక పోతున్నారు. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్లు.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, కంభంపాటి హ‌రిబాబు, కామినేని శ్రీనివాస్‌.. ఇలా చాలా మంది నేత‌లు.. ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ చేస్తున్న ఉద్య‌మాల‌కు, నిర‌స‌న‌ల‌కు క‌డుదూరంలో ఉండ‌డం.. సోముకు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం ప్ర‌ధానంగా ప్ర‌స్థావ‌న‌కు వ‌స్తున్నాయి. సోమును వ్య‌క్తిగ‌తంగా చూస్తే.. త‌న‌కు ఇచ్చిన ప‌ద‌వికి ఆయ‌న న్యాయం చేస్తున్నారు. అయితే.. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎక్క‌డ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో .. తెలుసుకుని వాటిని స‌రిచేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి రాబోయే రోజుల్లో బీజేపీ పుంజుకుంటుందో లేదో చూడాలి.