Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాల నిర్మాతే లలితా జ్యువెలరీ చోరీలో సూత్రధారి

By:  Tupaki Desk   |   6 Oct 2019 5:58 AM GMT
ఆ రెండు సినిమాల నిర్మాతే లలితా జ్యువెలరీ చోరీలో సూత్రధారి
X
కొన్నిసార్లు అంతే. నమ్మలేనట్లుగా కొన్ని జరుగుతుంటాయి. అలాంటిదే లలితా జ్యువెలరీ షోరూంలో చోరీ ఘటన. ఈ చోరీకి ప్లాన్ చేసిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆ చోరీకి ప్లాన్ చేసి.. దొంగతనం చేసిన మాస్టర్ మైండ్ రెండు తెలుగు సినిమాలకు నిర్మాత. షాకింగ్ గా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. ఏమీ చదువుకోని బాలమురగన్ తమిళనాడులోని తిరువారూర్కు చెందిన వాడు.

ఎలా అయినా కోటీశ్వరుడు కావాలన్నదే అతగాడి ఆశయం. అందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. 18 ఏళ్ల వయసులోనే సొంతింట్లో చోరీ చేసిన ఘనుడు. అలా మొదలైన అతడి చోరీల పరంపర.. అంతకంతకూ పెరిగిందే కానీ తగ్గలేదు. 2008లో ఒక ముఠాను ఏర్పాటు చేసిన బెంగళూరులో భారీ చోరీ చేసిన ఇతడు.. 2011లో ఒక చోరీ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత మకాంను హైదరాబాద్ కు మార్చేశాడు.

భాగ్యనగరంలో సొంతిల్లు కొనేసిన ఇతగాడికి సినిమాలు తీయాలన్న కోరిక ఎక్కువ. ఇందులో భాగంగా రూ.50 లక్షలతో బాలమురుగన్ ప్రొడక్షన్ పేరుతో ఒక సినీ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయటమే కాదు..తెలుగులో మనసా వినవే చిత్రానికి.. ఆత్మ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అందులో తన అక్కడ కొడుకు సురేశ్ ను నటింపచేశాడు. లలితా జ్యువెలరీలో సురేశ్ పాత్ర కూడా కీలకమని చెబుతున్నారు.

లలితా జ్యువెలరీ షోరూం చోరీకి ముందు పలు ప్రాంతాల్లో పలు చోరీలు చేయటం.. గోడలకు కన్నాలు వేయటంలో ఇతడికున్న నైపుణ్యం చాలా ఎక్కువని చెబుతారు. 2017లొ చెన్నైలోని అన్నానగర్.. తిరుమంగలం ప్రాంతాల్లో ఏకంగా 17 ఇళ్లకు కన్నాలు వేసి చోరీలు చేశాడు. అప్పట్లో ఇతని ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఏకంగా 5కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాతి కాలంలో సైబరాబాద్ పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఇతను.. నడవలేని స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దొంగలో మరో యాంగిల్ కూడా ఉంది. తన సొంతూరైన తిరువారూర్ కు వచ్చిన ప్రతిసారీ తమ గ్రామానికి చెందిన పలువురికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తాడని పోలీసులు చెబుతారు. ఈ కారణంతోనే.. అతడి గురించి.. ఆ ఊరి వాళ్లు ఒక్క మాట కూడా చెప్పరంటున్నారు. మొత్తానికి బాలమురగన్ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా?