Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహా నగరాన్ని ముంచేసిన వాన

By:  Tupaki Desk   |   23 July 2022 4:24 AM GMT
హైదరాబాద్ మహా నగరాన్ని ముంచేసిన వాన
X
హైదరాబాద్ మహానగరాన్ని వాన ముంచెత్తింది. శుక్రవారం ఉదయం మొదలైన వర్షం నాన్ స్టాప్ గా శనివారం లోనూ కొనసాగుతోంది. గడిచిన వారం అదే పనిగా కురిసిన వానలతో ఉక్కిరి బిక్కిరి అయిన హైదరాబాద్ వాసులకు.. శుక్రవారం ఒక్కరోజు కురిసిన వాన మాత్రం చేదు అనుభవాల్ని మిగిల్చింది. అంతకు ముందు వారం పాటు ముసురుపట్టి.. వర్షాలు కురిసిప్పటికి.. భారీ వర్షాలు కాకుండా.. అదే పనిగా చిరు జల్లులు కావటంతో పెద్దగా ఇబ్బందులు పడింది లేదు. అందుకు భిన్నంగా శుక్రవారం మాత్రం ఉదయం మొదలైన జోరువాన యావత్ హైదరాబాద్ మహానగరం మొత్తం వ్యాపించింది.

గంటల తరబడి కురిసిన వానతో హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావటమే కాదు.. కొన్నిచోట్ల ప్రధాన వీధులు సైతం వర్షపు నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. రోడ్లపై మోకాలి లోతులో నీళ్లు నిలవటంతో పాటు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కావటంతో మహానగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

చివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పెద్ద ఏకంగా ఒక ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడిందని.. బయటకు వెళ్లాలనుకునే వారు.. మామూలు సమయం కన్నా గంట ముందే బయలుదేరేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పటం చూస్తే.. హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై క్లారిటీ వస్తుందని చెప్పాలి.

జులై 8 నుంచి 16 వరకు మహానగరంలో మేఘాలు కమ్ముకొని.. వర్షాలు పడటంతో సామాన్యులు.. మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వానలు తగ్గి.. సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ.. ఊపిరి పీల్చుకుంటున్న హైదరాబాద్ వాసులు.. శుక్రవారం కురిసిన వర్షంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కావటమే కాదు.. పెద్ద ఎత్తున ఇళ్లల్లో నీళ్లు నిలవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.

శుక్రవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా.. మధ్యాహ్నం 12 గంటలకు జోరు వానగా మారింది. ఆ తర్వాత నుంచి తగ్గేదేలే.. అన్న చందంగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి కూడా ఇదే జోరు కంటిన్యూ అయ్యింది. హైదరాబాద్ మహానగరంలోని 15 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పరపల్లిలోని పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రరెస్ వే పిల్లర్ 191 వద్ద.. వర్ష ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మక్కా మజీద్ ఆవరణలో వజుఖానా వెనుకున్న పురాతన భవనం వర్షం ధాటికి కూలిపోయింది.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యధిక జనసమ్మర్థం ఉండే నిజాంపేటలోని పలు కాలనీల్లో వరద పోటు నెలకొంది. హైదరాబాద్ కు ఆ కొసన ఉన్న హయత్ నగర్ మొదలుకొని.. ఈ కొసకు ఉన్న పటాన్ చెర్వు తో పాటు నగరం నాలుగు వైపులా భారీ వర్షం కురవటంతో.. నగర వాసులు నానా తిప్పలు పడ్డారు. కూకట్ పల్లిలో 9.2 సెంటీమీటర్లు.. కుత్భుల్లాపూర్ లో 9 సెంటీమీటర్లు.. జీడిమెట్లలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా దంచికొట్టిన వానతో హైదరాబాద్ వర్షంలో చిక్కుకుపోగా.. లక్షలాది మంది హైదరాబాదీయులు వర్షంతో తీవ్ర అవస్థల పాలయ్యారు.