Begin typing your search above and press return to search.

ఐఎస్‌ టార్గెట్‌ గా లంక‌!... నేప‌థ్యం ఇదే!

By:  Tupaki Desk   |   14 May 2019 2:57 PM GMT
ఐఎస్‌ టార్గెట్‌ గా లంక‌!... నేప‌థ్యం ఇదే!
X
శ్రీ‌లంక‌... చుట్టూ స‌ముద్రం - మ‌ధ్య‌లో ఓ ద్వీపం... ఇదీ ఈ దేశ భౌగోళిక స్వ‌రూపం. స‌ముద్ర తీరం ఎంత పొడ‌వునా ఉంటే... శ‌త్రు దేశాల ముట్ట‌డికి అంత మేర ప్ర‌మాదం ఉందనే చెప్పాలి. ద‌శాబ్దాలుగా ఎల్టీటీఈ పోరుతో ర‌క్త ధార‌లు క‌ట్టిన లంక... ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్ర‌భాక‌ర్ తో పాటు అత‌డి మూక‌ను తుద‌ముట్టించిన నేప‌థ్యంలో లంక‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ‌కీయ హ‌డావిడి త‌ప్పించి... గ‌త కొంత‌కాలంగా లంక చాలా ప్ర‌శాంతంగానే ఉంటోంది. అలాంటిది మొన్న‌టి ఉగ్ర‌వాదుల వ‌రుస బాంబు పేలుళ్ల‌లో చిగురుటాకులా వ‌ణికిపోయింది. 253 మంది ప్రాణాలు తీసుకోవ‌డమే కాకుండా వంద‌లాది మందిని ఆసుప‌త్రి పాలు చేసిన ఈ ఉగ్ర‌దాడులు లంక‌ను నిజంగానే వ‌ణికించేశాయ‌ని చెప్పాలి.

ఈ గాయం నుంచి లంక ఇప్పుడ‌ప్పుడే కోలుకునే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు గానీ... ఏనాడూ ఉగ్ర‌వాదుల‌కు ప్ర‌వేశం లేని త‌మ దేశంలో ఇప్పుడు ఉగ్ర‌వాదులు ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు దారుణ మార‌ణ కాండ‌కు పాల్ప‌డ్డ తీరుపై లంకేయులు లోతైన విశ్లేష‌ణ‌లు చేసుకుంటున్నారు. అస‌లు ఉగ్ర‌వాదుల‌కు టార్గెట్ గా త‌మ దేశం ఎలా మారింద‌న్న విష‌యం ఇప్పుడు ప్ర‌తి లంకేయుడిని ప‌ట్టి పీడిస్తోందనే చెప్పాలి. త‌మిళులు - సింహాళీల మ‌ధ్య పోరుకు లంక కేరాఫ్ అడ్రెస్సే గానీ... క్రైస్త‌వులు - ముస్లింల మ‌ధ్య అక్క‌డ ఏనాడూ గొడ‌వ‌లు జ‌రిగిన దాఖలాలే లేవు. అలాంటిది దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇస్లామిక తీవ్ర‌వాదులు... ఏదో శత్రువుల స్థావ‌రాల‌ను ఎంచుకుని మ‌రీ చ‌ర్చీల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డ వైనంపై ఒక్క లంక‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగానూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఈ నేప‌థ్యంలో అస‌లు త‌మ దేశం ఉగ్ర‌వాదుల‌కు టార్గెట్ కావ‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విష‌యంపై ఇప్పుడు లంకేయులు అస‌లు సిస‌లు చ‌ర్చ‌కు తెర తీశారు. ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డే ప్ర‌మాదం ఉంద‌ని దాడుల‌కు ప‌ది రోజుల ముందుగానే భార‌త నిఘా వర్గాలు శ్రీ‌లంక ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించాయి. అంతేకాకుండా చ‌ర్చీలే ల‌క్ష్యంగా కూడా దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని కూడా ఈ హెచ్చ‌రిక‌లు చెప్పాయి. అయినా కూడా లంక అధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన గానీ, ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే గానీ ఈ హెచ్చరిక‌ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లానే క‌నిపించ‌లేదు. అయితే ఈ హెచ్చ‌రిక‌ల సందేశాలు అటు మైత్రిపాల‌కు గానీ, ఇటు విక్ర‌మ‌సింఘేకు గానీ చేరాయా? లేదా? అన్న విష‌యంపైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌హీంద రాజ‌ప‌క్స అధికారంలో ఉన్నంత కాలం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు - ప్ర‌భుత్వం మ‌ధ్య స‌త్సంబంధాలు క‌నిపించినా... రాజ‌ప‌క్స అధికారం నుంచి దిగిపోగానే ప‌రిస్థితి గాడి త‌ప్పింద‌న్న‌భావ‌న లంకేయుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. సిరిసేన ఓ వ‌ర్గంగా ఉంటే... ర‌ణిల్ మ‌రో వ‌ర్గంగా విడిపోయి అధికార యంత్రాంగాన్ని డైల‌మాలో ప‌డేశార‌ని చెప్పాలి. ఈ విష‌యాన్ని ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ‌లో ప‌నిచేస్తున్న చాలా మంది అధికారులు బ‌హిరంగంగానే చెబుతున్నారు. మొత్తంగా ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను ఏనాడో గాలికొదిలేసిన లంక ప్ర‌భుత్వం.. దాడులు జ‌రుగుతాయ‌ని హెచ్చరిక‌లు వ‌చ్చినా కూడా ప‌ట్టించుకోలేదంటే... లంక ప్ర‌భుత్వ స్వ‌యంకృతాప‌రాధ‌మే ఈ ఉగ్ర‌దాడుల‌కు కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. లంకేయుల్లోనూ ఇదే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.