Begin typing your search above and press return to search.

ఆ గ్యాంగ్ రేప్ నిందితుల విడుద‌ల‌పై విమ్శ‌ర‌ల వెల్లువ‌!

By:  Tupaki Desk   |   17 Aug 2022 10:37 AM GMT
ఆ గ్యాంగ్ రేప్ నిందితుల విడుద‌ల‌పై విమ్శ‌ర‌ల వెల్లువ‌!
X
20 ఏళ్ల క్రితం మార్చి 3, 2002న‌ గోద్రా రైలు ద‌హ‌న ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత గుజరాత్ లో అల్ల‌ర్లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దుండ‌గులు ఐదు నెల‌ల గ‌ర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో కుటుంబంపై దాడి చేసి ఏడుగురిని హ‌త్య చేసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో 11 మందికి జీవిత ఖైదు ప‌డింది. అయితే ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా వారికి క్ష‌మాభిక్ష పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో 11 మంది జైలు నుంచి విడుద‌ల‌య్యారు.

ఈ వ్య‌వ‌హారంపై గుజ‌రాత్ లోని బీజేపీ ప్ర‌భుత్వంపై, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్ర‌భుత్వంపైన ప్ర‌తిప‌క్షాలు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మోడీ తెల్ల‌వారి లేస్తే నారీశ‌క్తి, మ‌హిళా సాధికార‌త అని ఉప‌న్యాసాలు దంచుతుంటార‌ని.. మ‌రి ఐదు నెల‌ల గ‌ర్భిణి అనే క‌నిక‌రం లేకుండా ఒక మ‌హిళ‌పై అత్యాచారం చేసిన నిందితులను ఎలా విడిచిపెడ‌తార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

గుజరాత్ లోని బీజేపీ సర్కార్ బిల్కిస్ బానో హంతకుల్ని వదిలేయడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత‌ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై ప్రధాని మోడీ.. మహిళలకు ఏం చెప్తారని రాహుల్ నిల‌దీశారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా 3 ఏళ్ల చిన్నారి అని కూడా చూడ‌కుండా చంపిన వారిని విడుదల చేశారని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోడీ.. దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటని రాహుల్ నిల‌దీశారు. ప్ర‌ధాని చెప్పే మాట‌ల‌కు, చేత‌ల‌కు తేడాను దేశం గ‌మనిస్తోంద‌న్నారు.

కాగా ఆ ఘటనలో తన కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని బిల్కిస్ బానో భ‌ర్త‌ రసూల్ చెబుతున్నాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగాక సుప్రీంకోర్టు బిల్కిస్‌ కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.50 ల‌క్ష‌ల ప‌రిహారం అయితే ఇచ్చారు కానీ ఉద్యోగం, ఇల్లు ఇప్పించలేదని బిల్కిస్ బానో భ‌ర్త‌ రసూల్‌ చెబుతున్నాడు.

కాగా బిల్కిస్ బానో రేప్ కేసుకు సంబంధించి నిందితులు... జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేశ్ చందనా అనే 11 మంది ఖైదీలను గుజరాత్‌ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుదల చేసింది.

దీనిపై రాహుల్ గాంధీ సహా మ‌జ్లిస్ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ త‌దిత‌రులు మండిప‌డ్డారు. నారీ శ‌క్తి గురించి ప్ర‌ధాని మోడీ మాట్లాడిన గంటల్లోనే 11 మంది రేపిస్టుల‌ను విడిచిపెట్టార‌ని ఎద్దేవా చేశారు. మ‌హిళ‌ల విష‌యంలో బీజేపీ వైఖ‌రికి రేపిస్టుల విడుద‌ల అద్దం ప‌ట్టిందంటూ కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా దుయ్య‌బ‌ట్టారు.