Begin typing your search above and press return to search.

ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు.. వివరణ

By:  Tupaki Desk   |   10 July 2021 10:30 AM GMT
ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు.. వివరణ
X
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఓ మహిళా ఎంపీడీవోపై పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో శుక్రవారం పల్లెపగ్రతి , హరితహారం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన అనంతరం జరిగిన గ్రామ సభలో మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు.

పల్లెప్రగతిలో భాగంగా ప్రజలు తిరిగేలా వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని.. మళ్లీ నెల తర్వాత వస్తానని.. అప్పటివరకు ఇంకా అందంగా తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉన్నారా? అంటూ అడిగారు. మంత్రి వెనుకాల వచ్చి నిలుచుకున్న మహిళా ఎంపీడీవోను ఉద్దేవించి అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎర్రబెల్లి ఇరుకునపడ్డారు.

మంత్రి స్థాయిలో ఉండి మహిళా ఎంపీడీవోను గ్రామసభలో అందరి ముందు అవమానిస్తారా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. బాగా ట్రోల్ చేశారు.ఇవి ఎర్రబెల్లిని పరేషాన్ లో పడేశాయి. దీంతో వివరణ ఇచ్చారు.

-నా మాటలు వక్రీకరించారు: ఎర్రబెల్లి
ఉద్దేశపూర్వకంగానే కొందరు తన మాటలను సంచలనం కోసం వక్రీకరించారని.. ఇలా వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదని ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. ఉద్యోగులు, అధికారులపై తనకు గౌరవం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ మహిళా అధికారి కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతోనే 'బాగున్నవా బిడ్డా' అంటూ పలకరించానని.. అందులో పెడర్థాలు తీయవద్దని ఎర్రబెల్లి సూచించారు.

తెలంగాణ ఉచ్చరణలో భాగంగా 'మీరు బాగా ఉరికి పనిచేస్తున్నారని.. ఇంకా అందరినీ ఉరికించి పనిచేయించాలని' ఆ మాటలు అన్నానని.. ప్రొత్సహించడానికే అలా అన్నట్టు ఎర్రబెల్లి తన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.దీన్ని కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించారని ఇది సరికాదని హితవు పలికారు.