Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై నివేదిక ఇచ్చేది నేడే.. ఏముండనుంది?

By:  Tupaki Desk   |   20 Dec 2019 5:24 AM GMT
ఏపీ రాజధానిపై నివేదిక ఇచ్చేది నేడే.. ఏముండనుంది?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ హాట్ గా సాగుతున్న చర్చ మొత్తం ఏపీలోని రాజధానుల గురించే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సందర్బంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమో అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. నాటి నుంచి నేటి వరకూ మూడు రాజధానుల మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం 3.30 గంటల వేళలో సీఎం జగన్ తో ఏపీ రాజధాని మీద వేసిన జీఎన్ రావు కమిటీ భేటీ కానుంది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు రాజధానిపై అధ్యయనం చేయటానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇచ్చే నివేదికలోని అంశాలు ఏమేం ఉండనున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజధానులపై మూడు రోజుల క్రితం సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కమిటీ రాజధాని మీద ఏం చెప్పిందన్నది కీలకంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కమిటీ కూడా మూడు రాజధానులకు సిఫార్సు చేసి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

కమిటీ తన నిర్ణయాన్ని చూచాయగా ముఖ్యమంత్రికి ముందే సమాచారం ఇచ్చి ఉంటుందని.. ఈ కారణంతోనే జగన్ నోటి నుంచి మూడు రాజధానుల మాట వచ్చి ఉంటుందన్న వాదనను వినిపిస్తున్నారు. సీఎం జగన్ వ్యాఖ్యానించినట్లు మూడు రాజధానుల ప్రస్తావనను కమిటీ తన నివేదికలో వెల్లడించిందా? లేదా? అన్నది తేలాలంటే ఈ సాయంత్రం వరకూ వెయిట్ చేయక తప్పదు.