Begin typing your search above and press return to search.

మళ్లీ కొలువుదీరిన రాజస్థాన్ మంత్రి వర్గం ..

By:  Tupaki Desk   |   22 Nov 2021 6:31 AM GMT
మళ్లీ కొలువుదీరిన రాజస్థాన్ మంత్రి వర్గం ..
X
రాజస్తాన్ ప్రభుత్వం కేబినెట్ మళ్లీ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ గెహ్లాట్ కొత్త టీమ్‌ లో ముగ్గురు పాతవారికి 12 మంది కొత్త వారికి అవకాశం దక్కింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లో ఉన్న రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ అజయ్ మాకెన్ పాల్గొన్నారు. మరోవైపు సచిన్ పైలట్ తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 16 నెలల తర్వాత క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరిగింది.

కొత్త క్యాబినెట్‌లో సచిన్ పైలట్ మద్దతుదారులకు ఎక్కువ ప్రాధాన్యమే లభించింది. రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్‌లకు తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితో పాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రి వర్గంలో నూతనంగా చోటు దక్కింది. కొత్త కేబినెట్‌ పై సచిన్‌ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌ లో చోటు కల్పించామన్నారు. ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్‌ పైలెట్‌ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది.

ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్‌ పైలెట్‌ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్‌ శిబిరం ప్రచారం చేస్తోంది.

అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్‌చార్జ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రాష్ట్రానికి ఇన్‌ చార్జ్‌ గా వెళ్లినప్పటికీ రాజస్థాన్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్‌ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ రాష్టానికే ఇన్‌ చార్జ్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం