Begin typing your search above and press return to search.

వైరస్ ఎఫెక్ట్ : 25 వేల దుకాణాలు పూర్తిగా క్లోజ్ !

By:  Tupaki Desk   |   9 Jun 2020 11:11 AM GMT
వైరస్ ఎఫెక్ట్ : 25 వేల దుకాణాలు పూర్తిగా క్లోజ్ !
X
చైనాలో వెలుగులోకి వచ్చిన వైరస్ ...ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అయితే, ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో కంటే ..అమెరికాలోనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే అమెరికాలో వైరస్ భాదితుల సంఖ్య 20 లక్షలకి దాటిపోయింది. మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా దుకాణాల మూత, పరిమిత సేవల ఆంక్షల నేపథ్యంలో రీటైల్ పరిశ్రమ కుదేలైంది. దీంతో ఈ ఏడాదిలో సుమారు 25 వేల దుకాణాలు శాశ్వతంగా మూత పడనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. దేశంలోని మాల్స్, డిపార్టమెంటల్ స్టోర్లపై వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంలో పరిస్థితి 2019 నాటికంటే దారుణంగా వుంటుందని వెల్లడించింది.

రిటైల్ అండ్ టెక్ డేటా సంస్థ కోర్ సైట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రధానంగా మాల్స్‌లో చాలావరకు దుకాణాలు మూత పడనున్నాయి. వీటితోపాటు డిపార్ట్‌మెంట్ స్టోర్లు, బట్టల దుకాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేసింది. 2019లో 9,800కి పైగా దుకాణాలను మూసివేసిన రికార్డును బద్దలు కొట్టేంత తీవ్రంగా ఇది ఉంటుందని నివేదించింది. అలాగే మాల్‌లోని ప్రధాన అద్దెదారులు స్టోర్లను మూసివేస్తే, ఇతర అద్దె దారులు కూడా తమ షాపులు మూసివేయాల్సి వస్తుందని కోర్ సైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెబోరా వీన్స్ విగ్ తన నివేదికలో తెలిపారు. ఈ ప్రభావంతో మూతపడే దుకాణాల సంఖ్య 20-25 వేల వరకు ఉంటుందన్నారు.

వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి మధ్యలో అమెరికన్ రిటైలర్లు నష్టాల పాలయ్యారు. పలు షాపులు మూత పడ్డాయి. ప్రస్తుతం కొన్ని పరిమితులతో షాపులు తిరిగి తెరుచుకున్నప్పటికీ, లాక్‌ డౌన్‌ ప్రతిష్టంభనతో చిల్లర వ్యాపారులు జూన్ 5 నాటికి సుమారు 4 వేల దుకాణాలను శాశ్వతంగా మూసివేతకు నిర్ణయించడం గమనార్హం. వందల సంఖ్యలో దుకాణాలను మూసివేసిన వరుసలో జె.సి. పెన్నీ, విక్టోరియా సీక్రెట్ , పీర్1 ఇంపోర్ట్స్ సంస్థలు ఉన్నాయి.