Begin typing your search above and press return to search.

భేటీలో ప్రధానితో మాట్లాడే చాన్స్ ఆ అధికార పార్టీకి లేదు

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:00 AM GMT
భేటీలో ప్రధానితో మాట్లాడే చాన్స్ ఆ అధికార పార్టీకి లేదు
X
కొన్ని నిబంధనలు ఎందుకు పెడతారో అర్థం కాదు. వారు చెప్పే కారణాలు కన్వీన్స్ అయ్యేలా చేయవు. కీలక అంశాల విషయం వ్యవహరించే తీరు ఇదేనా? అన్న ప్రశ్నకు సమాధానం లభించదు. ఈ రోజున దేశంలో అధికార బీజేపీ తప్పించి.. కనుచూపు మేర దాని ప్రత్యామ్నాయం కానీ.. ప్రధాని మోడీకి సరిపోయే నేత కానీ కనిపించరు. కానీ.. ఇదే శాశ్వితం అనుకుంటే.. అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు.

ఒకప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి? అంత పెద్ద లోక్ సభలో వారికి ఉన్న సీట్లు కేవలం రెండంటే రెండు. అంత మాత్రానా ఆ పార్టీని తక్కువగా అంచనా వేయగలమా? బీజేపీకి రెండు సీట్లు ఉన్న వేళలో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశానికి దగ్గర దగ్గర నలభై వరకు (కాస్త అటుఇటుగా 38 అనుకుంటా) సీట్లు ఉన్న పరిస్థితి. జాతీయ పార్టీగా చెప్పే బీజేపీకి బదులుగా టీడీపీ విపక్షంగా నిలిచింది.
మొత్తంగా చెప్పేదేమంటే.. కాల ప్రవాహంలో కొన్నిపార్టీలు తమ సీట్ల విషయంలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. అంత మాత్రాన ఆ పార్టీల్ని తక్కువగా అంచనా వేయటం.. వాటిని పక్కన పెట్టేయటం లాంటివి సరికాదు. కరోనా వ్యాక్సిన్ పురోగతిని చర్చించేందుకు అఖిలపక్ష భేటీని ప్రధాని మోడీ నిర్వహిస్తున్నారు. అఖిలపక్షం అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించాలి. మరి.. ఊరుపేరు లేని పార్టీల్ని పక్కన పెట్టినా..ప్రజల్లో ఉన్న ఆదరణకు అనుగుణంగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది.

అయితే.. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదు. ఎందుకంటే పది కంటే ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీలకు మాత్రమే ప్రధానితో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. వర్చువల్ గా జరిగే ఈ భేటీలో రెండు సభల్లో (లోక్ సభ.. రాజ్యసభ) పది మంది సభ్యులు ఉన్న వారికి మాత్రమే అభిప్రాయాల్ని చెప్పే వీలుంది. ప్రధానికి అభిప్రాయాలు చెప్పటానికి ఇలాంటి పరిమితి పెట్టటం ఏమిటి? అన్నది ప్రశ్న.

ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో సీట్లు కోల్పోవటానికి చాలానే కారణాలు ఉండి ఉండొచ్చు. అంత మాత్రాన తనకున్న అభిప్రాయాల్ని చెప్పుకునే వీలు లేకపోవటం ఏమిటి? ఈ కారణంగా మహారాష్ట్రలో అధికారపక్షంలో భాగస్వామి అయిన శరద్ పవార్ తో సహా అకాలీదళ్.. వామపక్షాలు.. తెలుగుదేశం పార్టీలకు ప్రధానితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్.. టీఆర్ఎస్ లకు అవకాశం లభించనుంది. రాజకీయ పార్టీలకు సైతం ఇలాంటి రేషన్ పెట్టటం అంత సబబుగా లేదని చెప్పక తప్పదు.