Begin typing your search above and press return to search.

పదవులు ఇచ్చారు.. కుర్చీలు కూడా లేవే

By:  Tupaki Desk   |   23 Aug 2021 12:30 PM GMT
పదవులు ఇచ్చారు.. కుర్చీలు కూడా లేవే
X
రాజకీయ నేతలకు పదవులు కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెడతాయి. వారిలో హుషారు పెంచడమే కాదు మరింత చురుగ్గా తయారయ్యేలా చేస్తాయి. పదవులు వారిలో కొత్త కళను తీసుకొస్తాయి. కావాలంటే ప్రస్తుతం పవర్ ఫుల్ ప్లేస్ లో ఉన్న వారి ఫోటోల్ని.. అంతకు ముందు వారున్న ఫోటోల్ని దగ్గర పెట్టుకొని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు మాంచి పదవిలో ఉన్నవారు.. కొంతకాలానికి ఆ పదవుల నుంచి దిగిపోయిన ఆర్నెల్లకు వారిని చూస్తే.. పదవి మహత్యం ఇట్టే అర్థమైపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఏపీలోని అధికార పక్ష నేతలు పదవులు వచ్చినా వారి ముఖంలో కళా.. కాంతి కనిపించటం లేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

సింగిల్ షాట్ లో డజన్ల కొద్దీ రాష్ట్రస్థాయి పదవుల్ని ఒక జీవోలో ఇచ్చేసిన సీఎం వైఎస్ జగన్ ధైర్యానికి.. తెగువకు చాలామంది ముచ్చట పడిపోయారు. తమ జగనన్న ఇచ్చిన రాష్ట్రస్థాయి పదవులతో నేతల ఆనందం అంతా ఇంతా కాదన్నట్లుగా తయారైంది. ఇటీవల నామినేటెడ్ పదవుల్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో వైసీపీ నేతలంతా బోల్డంత సంతోషానికి గురయ్యారు. రానున్న రోజుల్లో తామేం చేయగలమన్న లెక్కలు భారీగా వేసుకున్నట్లు చెబుతారు.అయితే.. వారి ఆనందం కాస్తా ఇప్పుడు ఆవిరి అయిపోతుందట.

వివిధ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులతో పాటు.. డైరెక్టర్ పోస్టులు లభించిన చాలామంది నేతలకు.. తాము ఎంపికైన కార్పొరేషన్లకు భారీగా నిధులు వస్తాయని ఆశపడ్డారట. కానీ.. హోదా రావడం మినహా నిధులు రాకపోవటంతో వారంతా డంగైపోతున్నట్లు చెబుతున్నారు. పేరుకు నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పటికీ.. దానికో ఆఫీసు.. సిబ్బంది.. కుర్చీలు.. ఖర్చు చేయటానికి కాసిన్ని నిధులు ఏమీ లేకపోవటంతో వారు బిత్తరపోతున్నారు.

పేరుకు కార్పొరేషన్ ఛైర్మన్లు మాత్రమే కానీ.. చేసేందుకు ఏమీ ఉండటం లేదట. నేతల ప్రారంభోత్సవాలకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పాలు పంచుకోవటం మినహా మరింకేమీ చేయడం లేదంటున్నారు. తమతో పోలిస్తే.. డీసీసీబీ.. డీసీఎంఎస్ లకు ఛైర్మన్లుగా ఎంపికైన వారిని చూసుకొని ఆసూయ చెందుతున్నారట. ఈ సంస్థలకు ప్రత్యేకంగా ఆఫీసులు.. సిబ్బంది.. ప్రోటోకాల్ కూడా ఉండటంతో తమకిచ్చిన పదవులతో పోలిస్తే.. వారి పనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పదవులు ఇచ్చారు ఓకే కానీ... ఒక ఆఫీసు ఒక సీటు లేకపోతే పదవికి విలువ ఏం ఉంటుందని పెదవి విరుస్తున్నారు నేతలు. ఆఫీసే లేకపోవడంతో అనుచరుల్లో పదవి వచ్చింది నిజమేనా అన్న అనుమానం కూడా కలుగుతోందని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు చెబుతున్నారు. దీంతో పదవులు పొందిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉందంటున్నారు. అటు కిందకు రాలేరు.. అలా అని పైకి వెళ్లలేరు. నిత్యం పవర్ లేని పదవుల్ని చూసుకొని మురిసిపోవటం తప్పించి.. గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదనను ఎవరికి పంచుకోలేక సతమతమవుతున్నట్లుగా చెబుతున్నారు. తమకొచ్చిన కష్టం మరెవరికీ రాకూడదన్న మాట వారి నోటి వెంట వినిపిస్తోందని చెబుతున్నారు.