Begin typing your search above and press return to search.

మ‌హిళ‌లు.. బీసీల‌కే స్థానిక ప‌ద‌వులు.. జ‌గ‌న్ వ్యూహం ఇదేనా?!

By:  Tupaki Desk   |   17 March 2021 3:52 PM GMT
మ‌హిళ‌లు.. బీసీల‌కే స్థానిక ప‌ద‌వులు.. జ‌గ‌న్ వ్యూహం ఇదేనా?!
X
రాష్ట్రంలో ఇటీవ‌ల ముగిసిన స్థానిక ఎన్నిక‌ల్లో 11 కార్పొరేష‌న్లు.. 73 మునిసిపాలిటీల‌ను త‌న ఖాతాలో వేసుకుని చ‌రిత్ర సృష్టించి న అధికార పార్టీ వైసీపీ.. ఇప్పుడు అదే రేంజ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తూ.. స్థానిక పీఠాలను కీల‌క నేత‌ల‌కు అప్ప‌గించే విష‌యంలో.. సోషల్ ఇంజ‌నీరింగ్‌ కు ప్రాధాన్యం ఇస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డిన‌ప్పుడు.. కేబినెట్‌ లోకి అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను ఎంపిక చేసిన‌ట్టే.. ఇప్పుడు స్థానిక ప‌ద‌వుల్లోనూ ఇదే పార్ములాను ఆయ‌న పాటిస్తున్నారు. త‌ద్వారా.. బీసీలు - మ‌హిళల కీలక ఓటు బ్యాంకును వైసీపీకి సుస్ధిరం చేసుకోవ‌డంతోపాటు.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలాంటి విమర్శ‌లు రాకుండా చేసుకుంటున్నారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల‌ను డిఫెన్స్‌ లో నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక‌, 11 కార్పొరేష‌న్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు నిబంధ‌న‌ల మేర‌కు ఒక మేయ‌ర్‌ - ఒక డిప్యూటీ మేయ‌ర్ ఉండ‌గా.. ఇక‌పై మ‌రో డిప్యూటీ మేయ‌ర్‌ కు అవ‌కాశం క‌ల్పిస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ ను గ‌వ‌ర్న‌ర్‌ కు పంపారు. ఆయ‌న ఓకే అంటే.. ఒక్కొక్క కార్పొరేష‌న్‌ లో ఒక మేయ‌ర్‌ - ఇద్ద‌రు డిప్యూటీ మేయ‌ర్లు - పుర‌పాల‌క సంస్థ‌ల్లో ఒక చైర్మ‌న్‌ - ఇద్ద‌రు వైస్ చైర్మ‌న్లు ఉంటారు. ఇక‌, ఈ ప‌ద‌వుల విష‌యంలోనూ బీసీల‌కు పెద్ద పీట వేశారు. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం అందిన స‌మ‌చారం మేర‌కు.. విజయవాడ మేయర్‌ పదవిని బీసీ వ‌ర్గానికి చెందిన రాయ‌న‌ భాగ్యలక్ష్మీ(న‌గ‌రాలు)ని ఎంపిక చేశారు. విశాఖపట్నం మేయర్‌ గా హరి వెంకట కుమారి - వంశీకృష్ణ శ్రీనివాస్‌ లలో ఒకరికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది.

గుంటూరు మేయర్ పదవిని ఆశిస్తున్న ఇద్ద‌రికీ చెరి స‌గం పంచి పార్టీలో గొడ‌వ‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. తొలి రెండున్నరేళ్లు కావటి మనోహర్ నాయుడు(కాపు) ఉండనుండగా.. తర్వాతి రెండేళ్లు రమేష్ గాంధీ గుంటూరు మేయర్‌ గా వ్యవహరిస్తారు. తిరుపతి మేయర్‌ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీషను ఎంపిక చేశారు. చిత్తూరు మేయర్‌ గా ఎస్.అముద - విజయనగరం - విజయలక్ష్మీ - ఒంగోలు - గంగాడ సుజాత, - అనంతపురం - వసీం సలీమ్ - కర్నూలు - బీవై రామయ్య - కడప - సురేశ్ బాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం మేయర్ ఎవరనే విషయమై సస్పెన్స్ నెలకొంది. మొత్తంగా చూస్తే.. కీల‌క‌మైన మ‌హిళా - బీసీల ఓటు బ్యాంకును వైసీపీ వైపు తీసుకువ‌చ్చేందుకు జ‌గ‌న్ ఈ విధానం పాటించార‌ని తెలుస్తోంది.