Begin typing your search above and press return to search.

రైతుబంధు 10 ఎకరాలకె పరిమితం .. ప్రభుత్వం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:14 AM GMT
రైతుబంధు 10 ఎకరాలకె పరిమితం .. ప్రభుత్వం కీలక నిర్ణయం
X
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంపై కోత విధించనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే మొత్తం విషయంలో భూ పరిమితికి సంబంధించి షరతులు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 2018 ఖరీఫ్‌లో ప్రారంభమైన ఈ స్కీమ్‌ కింద ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందించడం తో ఖజానా పై పెద్ద ఎత్తున భారంపడింది. దీనికి ఆర్థిక మాంద్యం తోడవడం తో ప్రభుత్వాన్ని నిధుల కొరత వెంటాడుతోంది. రైతుబంధుకు కిందటేడాది రెండు సీజన్లు కలిపి రూ.10,501కోట్లు, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రూ.5,456 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.

ఈ మొత్తం కలిపి ఇప్పటికే రూ.15,957కోట్లు అయింది. ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తుండడంతో స్కీమ్‌ భారాన్ని కొంత తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రం లో 85 శాతానికి పైగా రైతులకు పదెకరాల లోపే భూమి ఉంది. రెండేళ్లుగా అమలు చేస్తున్న రైతుబంధులో ప్రభుత్వం ప్రతి సీజన్‌ లో కోతే పెడుతోంది. దీంతో ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచినా కేటాయిస్తున్న నిధులు, సాయం అందించాల్సిన రైతుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. 2018లో ఖరీఫ్ లో రూ.5,257 కోట్లు ఇస్తే.. 2018 రబీలో రూ.5,244 కోట్లు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. లిమిట్ పెడితే వెయ్యి కోట్ల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉందని.. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా పదెకరాల వరకు సాయం అందిస్తే దాదాపు ఏడు వందల కోట్లు మిగిలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనికి సీఎం అంగీకరించలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి ఇప్పటికే తెలియజేసారు. అయితే మారిన పరిస్థితులతో రూల్స్‌‌ మార్చేందుకు సీఎం కూడా అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రైతుబంధు నిధులు రూ.6862.50 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చినా రూ.5100 కోట్లు మాత్రమే రిలీజ్‌‌ చేసింది. అయితే , ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ..ఈ 10 ఎకరాల విధానం ఈ ఏడాది ఖరీఫ్‌‌ నుంచే అనధికారికంగా పదెకరాల స్లాబ్‌‌ అమలు చేస్తున్నట్లు అర్థమౌతుంది.