Begin typing your search above and press return to search.

దాసన్నలోనూ అదే బాధట...?

By:  Tupaki Desk   |   6 April 2022 7:34 AM GMT
దాసన్నలోనూ అదే బాధట...?
X
అవును మరి విధేయతగా ఉన్న వారికి కుర్చీలు పదిలం అని రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం. అయితే ఏపీలో ఫస్ట్ టైమ్ మంత్రి వర్గంలోని మంత్రులను తొలగించడం వెనక ఏ కారణం అయితే లేదు. కేవలం జగన్ నాడు సగం పాలన పూర్తి అయిన తరువాత మంత్రులను మార్చేస్తామని ఇచ్చిన హామీ మేరకే ఈ విస్తరణ జరుగుతోంది. నాడు అంతా బాగానే ఉందనుకున్నా తీరా ఆ టైమ్ వచ్చేసరికి మాత్రం ప్రతీ వారూ మధనపడుతున్నారు, బాధపడుతున్నారు.

మంత్రి కుర్చీ దూరం అవుతుంది అన్న ఆలోచననే వారు అసలు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు ఇలా అంటే అది పదవులలో ఉన్న మహిమే అనుకోవాలి. జగన్ కి ఇష్టులు అనుకున్న వారు కూడా మాజీలం అయిపోతున్నామని బాధపడుతున్న పరిస్థితి. చివరికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ సైతం తాను పదవి నుంచి దిగిపోతున్నాను అని బాహాటంగా చెప్పేశారు.

ఆయన సొంత నియోజకవర్గం నరసన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను మాజీ మంత్రిని అవుతున్నాను అని చెప్పి సంచలనం రేపారు. ఆ మాటతో ఆయన ఊరుకోలేదు. తాను వైఎస్సార్ కాలం నుంచి ఆ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిని అని చెప్పుకున్నారు. జగన్ పార్టీ పెట్టాక మొదట చేరింది కూడా తానే అంటున్నారు. ఒక విధంగా వీర విధేయతను ఆ కుటుంబం మీద చూపించాను అని కూడా ఆయన చెప్పుకుంటున్నారు.

మరి తాను చూపించిన విధేయతకు మాజీని చేయడమే పరిహారమా అన్న ఆయన మనసులో పుడితే తప్పు లేదు అనుకోవాలి. ఈ మధ్యనే ఆయన 2024 ఎన్నికల తరువాత జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు టీడీపీకి సవాళ్ళ మీద సవాళ్లు చేశారు. జగన్ సీఎం కాకపోతే ఏకంగా తన ఆస్తులను రాసిస్తాను అని చెప్పుకున్నారు. రాజకీయాల నుంచి కూడా సన్యాసం స్వీకరిస్తాను అని చాలెంజ్ చేశారు.

అంటే అంతలా వీర భక్తిని చూపించిన క్రిష్ణ దాస్ ని మంత్రి పదవి నుంచి తప్పించరు అని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఆయన కూడా మాజీ అవుతున్నారు అని వార్తలు రావడంతో ఆయన అనుచరులు అభిమానులలో అలజడి రేగుతోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే క్రిష్ణ దాస్ తాను మాజీ మంత్రిని అవుతాను అని చెప్పి వారికి షాక్ ఇచ్చేశారు. అసలు ఇది దాసన్నకు షాకింగ్ న్యూసే అంటున్నారు. మొత్తానికి ఈ మంత్రి గారు తన అసంతృప్తిని బయటపెట్టుకున్నారు అని అంటున్నారు.