Begin typing your search above and press return to search.

ఏపీకి వెళ్లాలనుకుంటున్నారా ..ఇది గుర్తుపెట్టుకోండి!

By:  Tupaki Desk   |   2 July 2020 9:50 AM GMT
ఏపీకి వెళ్లాలనుకుంటున్నారా ..ఇది  గుర్తుపెట్టుకోండి!
X
హైదరాబాద్ ‌లో మరోసారి లాక్ ‌డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంత ఊళ్లకు పయనమైయ్యారు. దీంతో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్‌ పోస్ట్‌ ల దగ్గర రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లే గరికపాడు, గుంటూరు జిల్లా మీదుగా వెళ్లే పొందుగల దగ్గర రద్దీ కనిపిస్తోంది. వాహనాలతో టోల్‌ గేట్ ‌లు, చెక్‌ పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్ ‌ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది.

పంతంగితో పాటూ మిగిలిన టోల్‌గేట్ల దగ్గర గురువారం వాహనాల రద్దీ పెరిగింది. ఇటు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్ పోస్టు వద్దకు భారీగా వాహనాలు చేరుకున్నాయి. స్పందన యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏపీ వాసులు వస్తున్నారు. జాతీయ రహదారిపై అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ ఆన్ ‌లాక్‌ 2.0 మార్గదర్శకాల్లో తెలిపింది. కానీ రాష్ట్రాలకు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చింది. దీంతో కొంతమంది పాసులు లేకుండా వస్తున్నారు.. వారిని పోలీసులు వెనక్కు పంపిస్తున్నారు.

గుంటూరు జిల్లా పొందుగల చెక్‌ పోస్ట్ దగ్గర కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. కొందరు పాసులు అవసరం లేదని భావించి నేరుగా రావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. వారి వాహనాలు రోడ్లపై నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా పాసుల అంశంపై స్పందించారు. పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని.. అందరూ సహకరించాలని కోరారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ పొందాలని సూచించారు. అలాగే ఉదయం గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుంది అని అంటున్నారు.