Begin typing your search above and press return to search.

మళ్లీ అదే జరిగింది.. ఎగ్జిట్ పోల్స్ కు మరోసారి భారీ షాకిచ్చిన పార్టీ

By:  Tupaki Desk   |   11 March 2022 4:30 AM GMT
మళ్లీ అదే జరిగింది.. ఎగ్జిట్ పోల్స్ కు మరోసారి భారీ షాకిచ్చిన పార్టీ
X
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేయటం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల ఫలితాల్ని కాస్తంత ముందే అందరూ ఊహించారు కానీ.. పంజాబ్ రాష్ట్ర ఫలితాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. గడిచిన కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని.. వ్యవసాయ చట్టాల పుణ్యమా అని బీజేపీ దెబ్బ తిన్నదన్న విషయంపైన అందరికి అవగాహన ఉంది. ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటుందన్న విషయం తెలిసిందే అయినా.. అదెంత? అన్న విషయాన్ని ఏ ఒక్కరు అంచనా వేయలేకపోయారు.

చివరకు ఎగ్జిట్ పోల్స్ సైతం ఆమ్ ఆద్మీ పార్టీ బలాన్ని.. ఆ పార్టీకి పెరిగిన ప్రజాదరణను గుర్తించే విషయంలో బొక్క బోర్లా పడ్డాయని చెప్పాలి. ఐదేళ్ల క్రితం ఇదే పార్టీకి పంజాబ్ లో 20 స్థానాల్ని సొంతం చేసుకుంటే.. ఈసారి అందుకు భిన్నంగా ఏకంగా 92 స్థానాల్లో విజయ ఢంకా మోగించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాల్ని తన ఖాతాలో వేసుకోవటం చూస్తే.. ఎంతగా బలపడిందో ఇట్టే అర్థమవుతుంది.

ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే.. మొదట్నించి కూడా ఈ పార్టీని అంచనా వేయటంలోనూ.. ఈ పార్టీ సాధించే విజయాల్ని సరిగ్గా గుర్తించిన ఎగ్జిట్ పోల్ ఏ ఒక్కటి లేదు.

ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీకి వచ్చే సీట్ల విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఏవీ దగ్గరకు రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ కు అదే పనిగా షాకిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పాలి.

తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి నిరూపించిందని చెప్పాలి. తాజా విజయంతో ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేయటమే కాదు.. జాతీయ రాజకీయ సమీకరణాల్ని సైతం మార్చే సత్తా ఆమ్ ఆద్మీలో ఉందన్న మాట వినిపిస్తోంది.