Begin typing your search above and press return to search.

ఇక ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ రెండో ఇన్‌చార్జ్.. జ‌గ‌న్ కంగారు దేనికి?

By:  Tupaki Desk   |   14 Sep 2022 9:43 AM GMT
ఇక ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ రెండో ఇన్‌చార్జ్.. జ‌గ‌న్ కంగారు దేనికి?
X
బ‌ట‌న్ నొక్కుడు ప‌థ‌కాలు త‌న‌కు మ‌రోసారి విజ‌యం సాధించిపెడ‌తాయ‌ని ఇప్ప‌టిదాకా ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ భావిస్తూ వ‌చ్చారు. అయితే తాజాగా త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ నివేదిక‌లతో జ‌గ‌న్‌కు కంగారు మొద‌ల‌యింద‌ని చెబుతున్నారు.

ప్ర‌శాంత్ కిశోర్ నివేదిక ప్ర‌కారం.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని అంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు వ‌న్‌టైమ్ వండ‌ర్ గా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారేన‌ని.. నియోజ‌క‌వ‌ర్గాల్లో వారంత స‌మ‌ర్థులు కాద‌ని పీకే నివేదిక ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో రెండో ఇన్‌చార్జ్‌ను నియ‌మించాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ సూచించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ఇలా గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను అద‌న‌పు ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. దీంతో అక్క‌డ ఉన్న ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి భ‌గ్గుమ‌న్నారు.

ఈ నేప‌థ్యంలో అద‌న‌పు ఇన్‌చార్జుల పేరుతో కాకుండా నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిశీల‌కుడు పేరుతో రెండో ఇన్‌చార్జ్‌ని నియ‌మిస్తార‌ని అంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలు బ‌ల‌హీనంగా ఉన్న‌చోట్ల‌, ఎమ్మెల్యేలు లేని చోట్ల ఇప్ప‌టికే ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల‌కు అద‌నంగా రెండో ఇన్‌చార్జిని నియ‌మిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు సంబంధించి జాబితా కూడా సిద్ధ‌మైంద‌ని.. ఒక వారం, ప‌ది రోజుల్లో ఆ జాబితాను ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జుల‌కు టిక్కెట్లు ఇవ్వ‌ని ప‌రిస్థితి ఉంటే ఈ రెండో ఇన్‌చార్జిగా ఉండే వ్య‌క్తి పోటీ చేసే అభ్య‌ర్థి అవుతార‌ని అంటున్నారు. అద‌న‌పు ఇన్‌చార్జితో పేరుతో నియ‌మిస్తే తాడికొండ‌లో జ‌రిగిన‌ట్టు గొడ‌వలు జ‌రుగుతాయి కాబట్టి ప‌రిశీల‌కుడు పేరుతో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి అద‌న‌పు ఇన్‌చార్జిని నియ‌మిస్తార‌ని స‌మాచారం.

అయితే ఇప్ప‌టికే 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌రో న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, జ‌న‌సేన పార్టీ త‌ర‌పున గెలిచిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వైఎస్సార్సీపీతో అంట కాగుతున్నారు. అంటే వైఎస్సార్సీపీకి 156 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు. మ‌రి ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో నియ‌మించే ఈ పరిశీలకుడు ఏం చేస్తాడ‌నేది స్ప‌ష్టం కావ‌డం లేదు. ఇప్ప‌టికే ఉన్న ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జులు ఈ రెండో ఇన్‌చార్జి పెత్తనాన్ని ఒప్పుకుంటారా అనే ప్ర‌శ్న‌లు కూడా త‌లెత్తుతున్నాయి.

అయితే వైఎస్సార్సీపీ అధిష్టానం మాత్రం ఈ రెండో అద‌న‌పు ఇన్‌చార్జుల నియామ‌కానికే మొగ్గు చూపుతుంద‌ని అంటున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర స్థాయిలో వైఎస్ జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు సానుకూలంగా లేర‌ని చెబుతున్నారు. ఎమ్మెల్యేల పైన తీవ్ర అసంతృప్తి ఉంద‌ని ప్ర‌శాంత్ కిశోర్ తాజా నివేదిక‌ల సారాంశం కూడా అని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రెండో ఇన్‌చార్జు నియ‌మకాల‌కు ఆ పార్టీ తెర తీస్తుంద‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.