Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో చిల్ల‌ర తో సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   6 Oct 2019 7:29 AM GMT
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో  చిల్ల‌ర  తో సంచ‌ల‌నం
X
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు తెల్లారేసరికి మరో పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. ఈ జంపింగ్‌ల‌ రాజకీయం ఇలా ఉంటే తమ సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు సామాన్యులు ఈ ఎన్నికలను అవకాశంగా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ స్వతంత్ర అభ్యర్థి చాలా వినూత్నంగా ఆలోచించాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లాతూర్‌ స్థానం నుంచి స్వతంత్ర పోటీ చేస్తున్న ఓ యువ అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు.

నామినేష‌న్ వేసేందుకు రు.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ రు.10 వేల‌ను రు.10 నాణేల‌తో నామినేష‌న్ అధికారుల‌కు చెల్లించ‌డంతో వారు అవాక్క‌య్యారు. అస‌లు విష‌యంలోకి వెళితే సంతోష్‌ సబ్డే (28) పట్టణంలో ఉన్న సెంట్ర‌ల్ లాతూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. లాతూర్ ప‌ట్ట‌ణంలో వ్యాపారుల‌తో పాటు ప‌లువురు దుకాణాదారులు రు.10 నాణేలు తీసుకోవ‌డం లేదు. దీనిపై కొద్ది రోజులుగా ప‌ట్ట‌ణంలో వ్యాపారులు వ‌ర్సెస్ కొనుగోలు దారుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ స‌మ‌స్య‌ను ఎవ్వ‌రు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. దీంతో దీనిని వెలుగులోకి తెచ్చేందుకు సంతోష్ ఇలా వినూత్నంగా ఎన్నిక‌ల్లో పోటీకి దిగాడు. ఓ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త‌న ఉద్దేశం స‌మ‌స్య‌ను వెలుగులోకి తెచ్చేందుకే అని.. అంత‌కు మించి తాను గెలుద్దామ‌నో... లేదా మ‌రో ఉద్దేశంతోనో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని చెప్పాడు.

ఇక ముందుగా ఎన్నిక‌ల అధికారులు కూడా రూ. 10 నాణేలను వద్దన్నారని, విషయం మీడియాకు తెలియడంతో రూ. 1000 వరకూ రూ. 10 నాణేలు తీసుకుంటామని, మిగిలింది నోట్ల రూపంలో ఇవ్వాలని కోరారని తెలిపారు. అయితే తాను ససేమీరా అనడంతో చివరకు మొత్తాన్ని రూ. 10 నాణేల రూపంలో స్వీకరించారని తెలిపారు.