Begin typing your search above and press return to search.

రెమ్‌డెసివిర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం ..ఇకపై అలా !

By:  Tupaki Desk   |   21 April 2021 7:30 AM GMT
రెమ్‌డెసివిర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం ..ఇకపై అలా !
X
దేశవ్యాప్తంగా కరోనాపై ఎంత చర్చ నడుస్తుందో..రెమ్‌ డెసివిర్ డ్రగ్‌ పైనా అంతే చర్చ నడుస్తుంది. ప్రధానంగా కరోనా వైరస్ తీవ్రమవుతున్న సమయంలో ఈ మందును ఇస్తూ డాక్టర్లు దీన్ని సిఫారసు చేయడంతో ఈ డ్రగ్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. చివరకు బ్లాక్‌ మార్కెట్‌ లో వేలకు వేలు పెట్టి కొనే స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం.. రెమ్‌డెసివిర్ ఎపిఐ, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌పై కస్టమ్స్ సుంకం ఎత్తివేసింది. ఫలితంగా ఈ మందు ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ఐతే, దీన్ని తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు. మరింత తక్కువ ధరకు దీన్ని అందిస్తాయా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే ధరను బాగా తగ్గించినట్లు ఆ కంపెనీలు చెబుతున్నాయి. ఈ రెమ్‌డెసివిర్ అనే మందును కరోనా వైరస్ తీవ్రం అవుతున్న సమయంలో మాత్రమే ఇవ్వాలి. అప్పుడు అది తీవ్రం అవ్వకుండా అడ్డుకుంటుంది. తద్వారా పేషెంట్ చనిపోకుండా బతుకుతారు.

కానీ, చాలా కేసుల్లో తీవ్రం అయిన తర్వాత కూడా ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చినా ప్రయోజనం ఉండదనీ ఆ దశలో పేషెంట్ చనిపోకుండా కాపాడటం ఈ మందు వల్ల కాదు అని చాలా పరిశోధనల్లో తేలింది. చాలా మంది డాక్టర్లు, ఆస్పత్రికి కరోనా పేషెంట్ ‌ని తేవగానే, ఈ మందు తెమ్మని చెబుతున్నారు. దాంతో పేషెంట్ కుటుంబ సభ్యులు ఈ మందు కోసం మందుల షాపుల చుట్టూ తిరుగుతూ పేషెంట్‌ని కాపాడాలనే ఉద్దేశంతో ఎక్కువ ధర పెట్టైనా కొంటున్నారు. దాంతో రూ.2000 ఉండే మందు కాస్తా రూ.20 వేలు పెట్టికూడా కొనడానికి వెనకాడటం లేదు. అయితే, ఇలా అమ్మడానికి వీల్లేదంటూ మొన్ననే కేంద్రం రెమ్ ‌డెసివిర్ ఇంజెక్షన్ ధరలను భారీగా తగ్గించింది. దేశంలో 7 ఫార్మా దిగ్గజ కంపెనీలు ఈ డ్రగ్ ‌ను తయారు చేస్తున్నాయి. అవి మందుపై రూ.2వేల దాకా తగ్గించాయి.బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకునేందుకు కేంద్రం ‘రెమ్‌డెసివిర్’, ఫార్మా వస్తువుల ఎగుమతిపై నిషేధం కూడా విధించింది. ఇలా వీలైనన్ని చర్యలు కేంద్రం తీసుకుంటోంది. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ డ్రగ్‌ను ఎక్కువగా తయారు చేస్తోంది. ఇది ఏ ప్రాంతంలో ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే... "readytofightcovid.in" ... ఏయే ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఉంది? ఏయే నగరాల్లోని ఏ ఫార్మా షాపుల్లో దొరుకుతుంది? వంటి వివరాలు ఇస్తూ... ఆయా ఆసుపత్రులు, ఫార్మాల అడ్రెస్‌లు, ఫోన్ నంబర్లు ఇచ్చింది.