Begin typing your search above and press return to search.

బీజేపీకి వ్యతిరేకంగా.. మహా కూటమి? అచ్చం 2004లానే పరిస్థితులు

By:  Tupaki Desk   |   23 Sep 2022 11:30 AM GMT
బీజేపీకి వ్యతిరేకంగా.. మహా కూటమి? అచ్చం 2004లానే పరిస్థితులు
X
అది 2004.. కేంద్రంలో వాజ్ పేయీ ప్రధాని.. ఎల్ కే అడ్వానీ ఉప ప్రధాని. బీజేపీ హవా దేశవ్యాప్తంగా సాగుతున్న రోజులు. ఏపీలో చంద్రబాబు నాయుడు వంటి బలమైన నేత అండ. ఒడిశాలో నవీన్ పట్నాయక్, బెంగాల్ లో మమతా బెనర్జీ ఇంకా ఎందరో బలమైన నేతలు వాజ్ పేయీ సారథ్యంలో కొనసాగేవారు.

ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడింది బీజేపీ. వరుసగా రెండోసారి అధికారంలో ఉండడం, ఓవైపు కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. 'భారత్ వెలిగిపోతోంది'అంటూ ప్రచారం చేయడంతో ప్రజలకు వెగటుపుట్టింది. అంతేగాక ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకుడు పాదయాత్ర చేసి ప్రజల్లో విపరీతమైన ఆదరణ చూరగొన్నాడు. అప్పటికి కాంగ్రెస్ అధికారంలో లేక ఏపీలో పదేళ్లు, కేంద్రంలో ఎనిమిదేళ్లు దాటింది. అటు బీజేపీ విధానాలపై విసుగెత్తిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

అంతకుముందు..? 2004 ఎన్నికలకు ముంద కాంగ్రెస్ కకావికలైంది. వాజ్ పేయీ వంటి నాయకుడి హవాను తట్టుకోలేక కుప్పకూలింది. దీనికితోడు సొంత వర్గ రాజకీయాలు సరేసరి. అలాంటి సమయంలో సోనియా గాంధీ నడుంబిగించారు. స్వయంగా చొరవ చూపి ఇతర విపక్ష నాయకులను కలుపుకొన్నారు. హరికిషన్ సింగ్ సూర్జిత్ వంటి వారి ఇళ్లకు వెళ్లి మరీ కూటమి కట్టేలా ఒప్పించారు. అలా పుట్టుకొచ్చిందే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ). వైఎస్ వంటి అత్యంత బలైమన ప్రాంతీయ నాయకుల తోడ్పాటుతో ఈ కూటమి 2014 వరకు అధికారంలో ఉంది.

మళ్లీ నాటి పరిస్థితులు అవినీతి, అసమర్థ పాలనతో యూపీఏ 2014లో ఓడిపోయింది. అద్భుత భారత్ అంటూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సహా ఈ ఎనిమిదేళ్లలో అనేక చర్యలకు దిగారు. మరోవైపు ప్రతిపక్షాలను అణగదొక్కారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి చోట్ల తమకు దక్కని అధికారాన్ని బలవంతంగా చేజిక్కించుకున్నారు. గోవా వంటి చిన్న రాష్ట్రాలనూ వదల్లేదు. ఇక బీజేపీ మతపరమైన అంశాలకు సంబంధించిన విధానాలు సరేసరి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయి. వామపక్షాల వంటివైతే ఉనికే లేకుండా పోయాయి. ఇలాంటి సమయంలో బీజేపీని ఎదుర్కొనేందుకు మళ్లీ కాలూ చేయీ కూడదీసుకుంటున్నాయి.

సోనియాను కలవనున్న లాలూ, నితీశ్‌ 2024 సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవు. అప్పటికి బలమైన పోటీదారుగా అవతరించాలంటూ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అందులోనూ కేంద్రంలో ఉన్నది
నరేంద్ర మోదీ వంటి నాయకుడు. ఈ క్రమంలో బీహార్ నాయకులు ముందుకొస్తున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసిన లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ చొరవ చూపుతున్నారు. అయితే, బీజేపీని ఎదుర్కొనే క్రమంలో ఏకతాటిపైకి వస్తున్నా..

చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను దూరం పెడుతున్నాయి. ఇటువంటి సమయంలో కీలక పరిణామం సంభవించింది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యేందుకు నీతీశ్‌‌, లాలూ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మహా కూటమి కట్టేందుకే ఈ ప్రయత్నాలని చర్చ సాగుతోంది. పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీనీ వీరు కలవనున్నారు. ప్రతిపక్షాల ఐక్యతతో బీజేపీని ఓడించడం వీరి ఉద్దేశమని స్పష్టమవుతోంది.

25న సోనియాతో భేటీ సోనియాతో నితీశ్, లాలూ ఆదివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏడేళ్ల కిందట బిహార్ ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేసిన సందర్భంగా సోనియా, నితీశ్, లాలూ ఇఫ్తార్ విందులో కలుసుకున్నారు. ఆ తర్వాత ఈ కూటమి విడిపోయింది. మళ్లీ రెండు నెలల కిందటే కలిసింది. అయితే, గత నెలలో రాహుల్‌ గాంధీని నితీశ్‌ కలిసినా అప్పుడు సోనియా లేరు. కాగా, పశు దాణా కుంభకోణంలో శిఓ అనుభవిస్తోన్న లాలూ ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్‌ వెళ్లనున్నారు. కాగా, కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు మమతకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ అంటుండడం, మిగతా ప్రతిపక్షాలకూ ఎటువంటి సందేహాలు లేకపోవడంతో కూటమి దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.