Begin typing your search above and press return to search.

యడ్డీకి ప్రత్యామ్నయం కోసం ఇన్ని అవస్తలా ?

By:  Tupaki Desk   |   28 July 2021 8:56 AM GMT
యడ్డీకి ప్రత్యామ్నయం కోసం ఇన్ని అవస్తలా ?
X
కర్నాటక విషయంలో బీజేపీ అగ్రనేతల పరిస్ధితి మరీ అయోమయంగా తయారైంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప స్ధానంలో కొత్త నేతను ఎన్నుకోవటానికి నరేంద్రమోడి, అమిత్ షా నానా అవస్తలు పడ్డారు. యడ్డీ రాజీనామా చేసి 48 గంటలైన తర్వాత అతికష్టమ్మీద బసవరాజ్ బొమ్మైని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి యడ్డీకి రీప్లేస్మెంట్ నేతను ఎంపిక చేయటం అంత సులభం కాదన్న విషయం బీజేపీ అగ్రనేతలకు అర్ధమైపోయింది.

ముఖ్యమంత్రి రేసులో చాలామందే ఉన్నారు. కానీ సరిగ్గా ఫిట్టయ్యే నేతే ఎవరికీ కనబడలేదు. యడ్డీని పక్కకు తప్పిస్తే తదుపరి సీఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో నెల రోజుల క్రితమే బీఎల్ సంతోష్ అనే నేత వచ్చి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుని ఢిల్లీకి వెళ్ళారు. అమిత్ షా ను కలిసి తన నివేదికను అందించారు కూడా. అయినా ఇపుడు అగ్రనేతలు ఎందుకింతగా కన్ఫ్యూజ్ అయ్యారో అర్ధం కావటంలేదు.

యడ్డీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే విషయంలో నేతలను మోడి, షా వెతకటమే విచిత్రంగా ఉంది. వెదుకులాటలో భాగంగా కేంద్రమంత్రులు ధర్మేంద్రపధాన్, కిషన్ రెడ్డిని బెంగుళూరుకు పంపారు. వీరిద్దరి అందరితో మాట్లాడి బొమ్మైని ఎంపిక చేశారని అంటున్నారు. కాంగ్రెస్ లో లాగే బీజేపీలో కూడా సీల్డ్ కవర్ సంస్కృతి ఎప్పుడో వచ్చేసింది. ఇంతోటిదానికి మోడి నిర్ణయించిన నేతే ఎవరో ప్రకటించేస్తే ఈ గందరగోళమంతా ఉండదు కదా ? అలా కాకుండా ఈ డ్రామాలెందుకు ఆడుతున్నారో అర్ధం కావటంలేదు.

అసలు ప్రత్యామ్నాయం ఎవరో చూసుకోకుండానే యడ్డీని తప్పించటమే పెద్ద తప్పనిపిస్తోంది. విచిత్రమేమిటంటే రేసులో ఉన్నవాళ్ళల్లో కొందరికి అనుభవం ఉన్నా వారిపై కేసులున్నాయి. మరికొందరి రికార్డు క్లీనుగా ఉన్నా అనుభవం లేదు. దీంతో ఏమి చేయాలో అగ్రనేతలకు అర్ధం కావటంలేదు. పైగా బలమైన లింగాయత్ సామాజికవర్గంనేత యడ్డీని తప్పించేయటంతో అంతటి ప్రజాధరణ కలిగిన నేత బీజేపీకి దొరకలేదు. మొత్తానికి బొమ్మైని ఎంపిక చేశారంటున్నారు. దాంతో సీఎం పదవికి అర్హతలు కలిగిన గట్టి నేత లేరనే విషయం అందరికీ తెలిసిపోయింది.