Begin typing your search above and press return to search.

అదేంది గుంగుల.. చిన్నసారు పెద్ద సారును దాటేసేలా చేశారే?

By:  Tupaki Desk   |   24 July 2021 3:49 AM GMT
అదేంది గుంగుల.. చిన్నసారు పెద్ద సారును దాటేసేలా చేశారే?
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి విషయంలో అద్యంతం అప్రమత్తంగా ఉండాలి. చిన్న పొరపాటుకు తావివ్వకూడదు. అందులోని పట్టించుకోనట్లుగా ఉంటూనే.. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే అలవాటున్న పార్టీ అధినాయకుడు కేసీఆర్ లాంటి టిపికల్ నేత ఉన్న వేళ.. పార్టీ నేతలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

చిన్న విషయాలే అన్నట్లుగా కనిపించినా.. సీరియస్ కావటం ఖాయం. మరి.. ఈ చిన్న విషయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న గంగుల కమలాకర్ మిస్ అయ్యారా? లేదంటే అనుకోని పొరపాటు ఏమైనా జరిగిందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

అధినేతలు.. వారి వారసుల పుట్టినరోజుల్ని ఘనంగా జరపటం గడిచిన కొద్దికాలంగా కొత్త ట్రెండ్ గా సాగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగినా.. అకాల వర్షాల నేపథ్యంలో ఎవరూ హైదరాబాద్ రావొద్దని... తాను ఎవరిని కలవటం లేదని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. చిన్నసారు వద్దన్నంత మాత్రాన తమ మదిలో నిండుగా ఉండే అభిమానాన్ని ఎవరికి వారు వారికి తోచిన రీతిలో ప్రదర్శిస్తుంటారు.

ఇందులో ముఖ్యమైనది.. దినపత్రికల్లో భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం. తాజాగా అలాంటి ప్రకటనే ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన నిలువెత్తు జాకెట్ యాడ్ సరికొత్త చర్చకు తెర తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందన్న పేరున్న ఒక దినపత్రికలో భారీ యాడ్ ఇచ్చారు గంగుల. అయితే.. ఈ ప్రకటనలో ప్రింట్ చేసిన ఫోటోల్ని చూసినప్పుడు.. వేర్వేరుగా ఉన్న సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ఫోటోల్ని ఫోటో షాప్ లో తమకు తోచినట్లుగా తయారు చేయించారు.

ఈ ఫోటోను చూసినంతనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్తంత ముందుగా మంత్రి కేటీఆర్ వచ్చినట్లుగా కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతున్న వేళ.. కేటీఆర్ మనసు దోచుకునేందుకు వీలుగా ఈ ప్రకటనను రూపొందించారా? అన్నది ప్రశ్నగా మారింది. కేటీఆర్ మనసు దోచుకునే క్రమంలో కేసీఆర్ హర్ట్ అయ్యేలా యాడ్ డిజైన్ చేయించరు కదా? అన్నది మరో ప్రశ్న. అయితే.. ఇదంతా అనుకోకుండా జరిగిందా? కావాలనే జరిగిందా? అన్న ప్రశ్నల తలెత్తలా ఉందని మాత్రం చెప్పక తప్పదు.

ఏమైనా.. సీఎం కేసీఆర్ ను దాటేసినట్లుగా ఉన్న కేటీఆర్ ఫోటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫోటోలో ఇలా ఉన్నా.. మ్యాటర్ లో మాత్రం రాబోయే రోజుల్లో ఏం జరగనుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. ‘దైవంలాంటి తండ్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో.. మీకు బంగారు భవిష్యత్తు కలుగాలని ఆకాంక్షిస్తూ..’ అని పేర్కొన్న మాటలు.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పేసినట్లుగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.