Begin typing your search above and press return to search.

నాలుగో వేవ్ షురూ? చాలాకాలం తర్వాత పెరిగిన పాజిటివిటీ..

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:37 AM GMT
నాలుగో వేవ్ షురూ? చాలాకాలం తర్వాత పెరిగిన పాజిటివిటీ..
X
మొదటి వేవ్ కు ముందు భారీగా సాగిన ప్రచారం.. అంతకు మించిన జాగ్రత్తలు. రెండో వేవ్ ను పెద్ద సీరియస్ గా తీసుకోనందుకు ప్రతిగా భారీ మూల్యాన్నే చెల్లించిన పరిస్థితి. దీంతో.. మూడో వేవ్ ముందు వణికిన ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించేలా చేస్తూ.. ఒక ఊపు ఊపి వెళ్లినా తీవ్రత తక్కువ కావటంతో ప్రజల మీద పడిన ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి.

దీంతో.. మొదటి మూడు వేవ్ లు పూర్తి అయిన నేపథ్యంలో నాలుగో వేవ్ అంతగా ఉండదన్న మాట వినిపించింది. అయితే.. ఈ వాదనలో నిజం లేదన్నట్లుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉన్నాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అన్నంతనే ఒక్కసారిగా విస్మయం. ఎందుకంటే.. దేశంలో కరోనా కేసుల నమోదు చాలా చాలా తక్కువగా ఉన్న వేళ.. సురక్షిత జోన్ లో ఉండే సోనియాకు కరోనా ఏమిటన్న సందేహం వ్యక్తమైంది. ఆ వెంటనే ప్రియాంక గాంధీ.. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు పాజిటివ్ గా తేలటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి.

గడిచిన నెలలో బాలీవుడ్ కు చెందిన పలువురు (అక్షయ్.. కార్తీక్ ఆర్యన్.. ఆదిత్యరాయ్ కపూర్ తదితరులు) మహమ్మారి బారిన పడటంతో ఇప్పుడు కొత్త వాదన మొదలైంది. దేశంలో నాలుగో వేవ్ షురూ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ వాదనను బలపరిచేలా గణాంకాలు బయటకు వస్తున్నాయి. శనివారం ఒక్కరోజులు దేశ వ్యాప్తంగా 3962 కొత్త కేసులు నమోదు కాగా.. ఆదివారం ఆ సంఖ్య 4270కు పెరిగింది. రోజు వ్యవధిలో ఇంత భారీగా కేసుల సంఖ్య ఒక్కరోజులో పెరగటం ఈ మార్చి 11 తర్వాత ఇదే కావటం గమనార్హం. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్ని చూస్తే.. దేశంలోని మహానగరాల్లో దీని జాడ పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెబుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ.. ముంబయిలలోనే కావటం గమనార్హం.

ఆదివారం నమోదైన 4270 కేసుల్లో 1357 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే కావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో.. మాస్కులు వాడాల్సిన అవసరాన్ని మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్ని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా నాలుగో వేవ్ కు సంబంధించిన ఆందోళన ఇప్పుడు అందరిలో ఆరంభమైందని చెప్పక తప్పదు. అయితే.. నాలుగో వేవ్ కు అవకాశం లేదని వాదించే వారు లేకపోలేదు. ఏమైనా.. రిస్కు తీసుకోకుండా కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.