Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్సీల బ‌లం.. ఈ రోజు ఎంత త‌గ్గి పోతుంది?

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:05 AM GMT
టీడీపీ ఎమ్మెల్సీల బ‌లం.. ఈ రోజు ఎంత త‌గ్గి పోతుంది?
X
మండ‌లిలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ మంది స‌భ్యుల‌ను క‌లిగి ఉంది. అయితే ఆ బ‌లంలో క్ర‌మంగా త‌గ్గుద‌ల చోటు చేసుకోవ‌డం అయితే ఖాయంగా క‌నిపిస్తూ ఉంది. ఇప్ప‌టికే మండ‌లిలో తెలుగుదేశం పార్టీకి కొన్ని ఝ‌ల‌క్ లు త‌గిలాయి. వికేంద్రీక‌ర‌ణ బిల్లును ప్ర‌భుత్వం మండ‌లిలో ప్ర‌వేశ పెట్టాల‌ని చూడ‌గా, త‌మ‌కు ఉన్న మెజారిటీని ఉప‌యోగించుకుని తెలుగుదేశం పార్టీ అడ్డు త‌గిలింది. రూల్ 71పై చ‌ర్చ‌ను ప్రారంభించి , తెలుగుదేశం పార్టీ దానిపై ఓటింగ్ ను పెట్టించుకుంది.

ఆ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీనే నెగ్గిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రు స‌భ్యుల బ‌లం మాత్రం త‌గ్గిపోయింది. ఆ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 27 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 13 ఓట్లు ప‌డ్డాయి. మిగ‌తావి త‌ట‌స్థంగా ప‌డ్డాయి. అయితే మండలిలో తెలుగుదేశం పార్టీకి ముప్పై మందికి పైగా స‌భ్యులున్నారు. కానీ అనుకూలంగా ప‌డ్డ ఓట్లు మాత్రం 27 మాత్ర‌మే. ఒక ఎమ్మెల్సీ రాజీనామా అంటూ స‌భ‌కే రాలేదు. ఆయ‌నే డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్.

ఇక మండ‌లికి హాజ‌రై కూడా తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ఇద్ద‌రు ఎమ్మెల్సీలు ఓటేశారు. వారే పోతుల సునీత‌, శివనాథ్ రెడ్డిలు. వీరిద్ద‌రూ మండ‌లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిల‌బ‌డ్డారు. మండ‌లిలో వైసీపీ బ‌లం 9 సీట్లు మాత్ర‌మే అయినా.. ఆపార్టీకి అనుకూలం గా మొత్తం 13 ఓట్లు ప‌డ్డాయి. ఇది మండ‌లిలో మొద‌టి రోజు క‌థ‌.

మండ‌లి స‌మావేశం సంద‌ర్భం గా రెండో రోజు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌నేది అత్యంత ఆస‌క్తిదాయ‌కం గా మారింది.