Begin typing your search above and press return to search.

అప్ఘనిస్తాన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ కట్ చేసిన తాలిబన్లు

By:  Tupaki Desk   |   5 May 2022 11:11 AM GMT
అప్ఘనిస్తాన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ కట్ చేసిన తాలిబన్లు
X
అమెరికా సారథ్యంలో అప్ఘనిస్తాన్ లో పాశ్చాత్య పోకడలు వెల్లివిరిస్తే.. తాలిబన్ల రాకతో ఇన్నాళ్లు స్వేచ్ఛగా తిరిగిన మహిళలు ఇప్పుడు బురఖాలో బందీ అయిపోయారు. హక్కులన్నీ పోయి ఇంటికే పరిమితమైపోయారు. తాలిబన్లు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఇక్కడి ప్రజలను పీడిస్తున్నారని కొన్ని మీడియాలు కథనాలు చెబుతున్నాయి. మహిళలను కఠిన ఆంక్షలతో వారిని బయటకు రాకుండా తిరగకుండా.. విమానాలు ఎక్కకుండా ఆంక్షలు విధించారు. ఉల్లంఘిస్తే ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నారు.

అప్ఘనిస్తాన్ లో పీఠంపై కూర్చున్న తాలిబన్లు తాము ప్రజలను హింసించమని, సాధారణ పాలనే కొనసాగిస్తామని ఇదివరకే చెప్పారు. కానీ కొన్ని చోట్ల తాలిబన్లు మాత్రం తమ రూల్స్ పాటించకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని నిబంధనలను చెప్పారు. అవి పాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ముఖ్యంగా మహిళల విషయంలో తాలిబన్లు కొన్ని కఠినతరమైన నిబంధనలు పెట్టారు. బుర్ఖా లేకుండా మహిళలు రోడ్డుపైకి రావొద్దని అంటున్నారు. ఇక బాలికలను చదువులకు దూరం చేశారు. బాలికల ఉన్నత విద్యకు అనుమతించడం లేదు. ఆరోతరగతి వరకే పరిమితం చేస్తున్నారు. ఇక రోడ్డుపై వాహనాల్లో వెళితే మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయని, అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అంటున్నారు.

ఇక మహిళల ఉద్యోగాలపైనా తాలిబన్ల ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజాగా అప్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబన్ ప్రభుత్వం నిలిపివేసింది. అప్ఘన్ లోని కాబూల్, ఇతర ప్రావిన్స్ లలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేసినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రస్తుతానికి మహిళా డ్రైవర్లకు లైసెన్స్ లు జారీ చేయవద్దని మౌళికంగా ఆదేశాలు ఇచ్చామని.. అయితే మహిళలు డ్రైవింగ్ చేయవద్దని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ట్రాఫిక్ హెడ్స్ చెబుతున్నారు. తాలిబన్ల ప్రభుత్వం తాజా ఆదేశాలతో తర్వాత తరానికి మాకు లభించిన అవకావఆలు అందవని మహిళలు వాపోతున్నారు.

1996లోనూ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకొని ఆంక్షలు కొనసాగించారు. ఈసారి అలా చేయమని చెప్పి ప్రజలకు మాట ఇచ్చారు. కానీ పాలన ప్రారంభమైన కొద్ది నెలలకే ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మహిళలను చదువు, ఉద్యోగాలు, డ్రైవింగ్ సహా అన్నింటికి దూరం చేసి వంటింటి కుందేళ్లుగా మార్చేస్తున్నారు.