Begin typing your search above and press return to search.

శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా.. ఈ బాదుడేంది?

By:  Tupaki Desk   |   16 May 2021 11:30 AM GMT
శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా.. ఈ బాదుడేంది?
X
వస్తువులు కావొచ్చు.. వస్తు సేవలు కావొచ్చు.. వాటిని కొనుగోలు చేసినా.. వాటిని పొందినా సర్కారు వారికి పన్ను రూపంలో కప్పం చెల్లించటం మామూలే. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో జీఎస్టీ బాదుడ్ని చాలా గ్రాండ్ గా బాదేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన రోజుల్లో ఫర్లేదు కానీ.. కరోనా లాంటి కష్ట సమయంలో.. కిందామీదా పడుతున్న రోగుల జేబుల్లో నుంచి జీఎస్టీ పేరుతో లాగేస్తున్నారు.

కోవిడ్ కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న వేళ.. కొవిడ్ పేషెంట్లకు ఉపయోగపడే మందులు.. చికిత్స సామాగ్రికి పన్ను బాదుడు ఒక రేంజ్ లో ఉండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కరోనా పేషెంట్లకు వినియోగించే వాటి మీద పన్ను కనిష్ఠంగా ఆరు శాతం నుంచి గరిష్ఠంగా 18 శాతం వరకు ఉండటం గమనార్హం.

ప్రాణా ఔషధాలుగా చెప్పే రెమ్ డెసివిర్.. మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు.. సంబంధిత పరికరాలపై 12 శాతం జీఎస్టీ అమల్లో ఉండటం గమనార్హం. అత్యధిక మందులపైన 12 నుంచి 18 శాతం వరకు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో జీఎస్టీ బాదుడ్ని తగ్గించాలని రాష్ట్రాలు కోరుతున్నా.. కేంద్రం నుంచి మాత్రం ఇప్పటివరకు సానుకూల స్పందన వచ్చింది లేదు.

అత్యవసర వైద్య సేవల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకన్న కొవిడ్ టెస్టింగ్ కిట్ లు.. ఫేస్.. సర్జికల్ మాస్కులు.. వెంటిలేటర్లు.. క్రత్రిమ శ్వాస పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం ఇటీవల రద్దు చేసినా.. జీఎస్టీని మాత్రం ఇంకా కొనసాగిస్తోంది. కరోనా వైద్యానికి అవసరమైన కొన్ని మందులు.. పరికరాలు.. జీఎస్టీ పరిధిలో ఉన్న వాటిని పన్ను రహితంగా చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

18 శాతం జీఎస్టీ పరిధిలోనివి..
- స్టెరిలైజేషన్ కు ఉపయోగించే ఇథైల్ అల్కహాల్
- సబ్బులు.. చర్మ శుభ్రతకు వినియోగించేవి
- శానిటైజర్లు.. హ్యాండ్ వాష్ లు
- ప్రమాదకర వ్యర్థాలు వేసేందుకు వాడే కవర్లు
- ప్లాస్టిక్ తో చేసే రక్షణ పరికరాలు
- క్రిమి సంహారకాలు
- టిష్యూ పేపర్లు.. న్యాప్ కిన్ లు
- క్లాత్ తో చేసే గ్లౌజ్ లు.. ఇతర రక్షణ ఉత్పత్తులు
- సెల్యూలోజ్ ఫైబర్ తో చేసిన మాస్కులు
- తలకు వాడే నెట్ లు
- రోగుల నుంచి ఫ్లూయిడ్స్ సేకరించే శానిటరీ వేర్
- ల్యాబ్ పరికరాలు.. స్టెరిలైజేషన్ కు వాడేవి.
- థర్మామీటర్లు.. సైకో మీటర్లు.. హైగ్రో మీటర్లు.. క్యాలిబరేటింగ్ మీటర్లు
12 శాతం జీఎస్టీ పరిధిలో ఉండేవి
- మెడికల్ ఆక్సిజన్
- కొవిడ్ నిర్దారణ కిట్ లు.. రీజెంట్ లు
- వెంటిలేటర్లు.. ఇతర శ్వాస పరికరాలు
- మెకానికల్ విడి భాగాలు.. ఫిల్టర్ ఉన్న మాస్కులు
- రబ్బర్ గ్లౌజ్ లు
- రక్షణ కళ్లద్దాలు
- ఆపరేషన్ కు వాడే సామాగ్రి