Begin typing your search above and press return to search.

పరీక్షలు చేయకుంటే కేసులు ఎందుకు పెరుగుతాయి?

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:11 PM GMT
పరీక్షలు చేయకుంటే కేసులు ఎందుకు పెరుగుతాయి?
X
తెలంగాణలో కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు గతంలో పలుమార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని, కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా గణాంకాలు, చికిత్స, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులకు సంబంధించిన పలు పిటిషన్లపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఆ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా పరీక్షల విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎందుకు వెనకబడి ఉందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేసీఆర్ సర్కార్ పై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగానాలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటిందని, అయినా ఒక్కో ప్రాథమిక కేంద్రం/ అనుమతిచ్చిన ల్యాబుల్లో తక్కువ పరీక్షలు ఎందుకు జరుగుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 1228 అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గి రికవరీ పెరిగిందని హైకోర్టుకు వైద్యారోగ్యశాఖ అధికారి వివరించారు. అయితే, రాష్ట్రంలో కరోనా పరీక్షలే ఎక్కువ చేయనప్పుడు కేసులు ఎలా తగ్గుతాయని ధర్మాసనం ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా టెస్ట్ ల్యాబ్‌లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని, అపుడే ఎక్కువ పరీక్షలు చేసే వీలుంటుందని అభిప్రాయపడింది. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదని,తప్పుడు లెక్కలతో కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేసింది.