Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏలు ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ?

By:  Tupaki Desk   |   12 Feb 2021 11:30 PM GMT
ఎంఎల్ఏలు ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు  ?
X
అధికార పార్టీ ఎంఎల్ఏలు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పంచాయితి ఎన్నికల్లో తమ మద్దతుదారులు తప్ప ఇంకెవరు పోటీ చేయకూడదని, ఒకవేళ పోటీచేసినా జనాలు మాత్రం తమ మద్దతుదారునికే ఓట్లేయాలని రెచ్చిపోతున్నారు. ఒకపుడు ఓట్లేయమని జనాలను బతిమలాడుకునే వాళ్ళు అభ్యర్ధులు, నేతలు. కానీ ఇపుడు ట్రెండ్ మారిపోయినట్లుంది. అందుకనే ఓట్లేయాలని, వేయకపోతే అంటు బెదిరిస్తున్నారు.

తాజాగా కృష్ణాజిల్లాలోని పెడన ఎంఎల్ఏ జోగి రమేష్ చేసిన బెదిరింపులు వైరల్ గా మారాయి. జగనన్న ఇస్తున్న పెన్షన్ తీసుకుంటు, జగన్ అన్న ఇస్తున్న రేషన్ సరుకులు తీసుకుంటు, ఇళ్ళు తీసుకుని వైసీపీకి ఓట్లేయరా ? అంటూ మండిపోయారు. సరే జోగిరమేష్ బెదిరింపులు వైరల్ అయినాక స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. రమేష్ ను 13వ తేదీ వరకు మీడియాతో కానీ జనాలతో కానీ మాట్లాడకుండా నియంత్రించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

ఇక్కడ నిమ్మగడ్డ ఎస్పీని ఆదేశించటం, రమేష్ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవటమో లేకపోతే ఆదేశాలు చెల్లవని కోర్టు తీర్పు చెప్పటమే ఇష్యుకాదు. అసలు జనాలతో ఏమి మాట్లాడాలి ? ఏమి మాట్లాడకూడదన్న విచక్షణ కూడా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. మొన్నటికి మొన్న విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి ఎంఎల్ఏ కన్నబాబు కూడా ఇలాగే మాట్లాడారు. ఓటర్లను బెదిరించినందుకు ఎంఎల్ఏపై పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. అధికారపార్టీ ఎంఎల్ఏలపై పోలీసులు కేసులు పెడితే ఏమవుతుంది ?

ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వం నుండి సంక్షేమపథకాలు అందుకుంటున్నంత మాత్రాన జనాలు అధికారపార్టీకే ఓట్లేయాలనే రూలేమీ లేదు. తమకిష్టమైన అభ్యర్ధికి ఓట్లేసే స్వేచ్చ ఓటర్లకుంది. ఇంత మాత్రం ఇంగితం కూడా అధికారపార్టీ ఎంఎల్ఎలకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమపథకాలన్నీ తన జేబులో డబ్బులు ఖర్చు చేస్తున్నారా ? ప్రజలు కట్టే పన్నులనే తిరిగి సంక్షేమపథకాలకు ఖర్చు పెడుతున్నారు.

గతంలో నంద్యాల ఉపఎన్నికకు ముందు చంద్రబాబునాయుడు కూడా ఇలాగే మాట్లాడారు. ‘నేను ఇచ్చే రేషన్ తీసుకుంటు, నేను ఇచ్చే ఫించన్ తీసుకుంటు, నేను వేసిన రోడ్లమీద తిరుగుతు టీడీపీకి ఓట్లేయరా’ ? అంటూ గదమాఇంచారు. అయితే జనాల్లో నుండి ఎవరో ‘మీ జేబులో డబ్బు తీసి ఖర్చు పెడుతున్నారా ? జనాల కట్టే పన్నులతోనే కదా చేస్తున్నది’ అని ఎదురుతిరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ హయాంలో చింతమనేని ప్రభాకర్ లాంటి కొందరు ఎంఎల్ఏలు కూడా ఇలాగే మాట్లాడారు. అధికారమే వీళ్ళతో ఇలాగ మాట్లాడిస్తుందేమో.