Begin typing your search above and press return to search.

ట్రావెన్ కోర్ కు కరోనా దెబ్బ ఎంతంటే.. తాకట్టులో స్వామి బంగారం

By:  Tupaki Desk   |   27 Aug 2020 1:00 PM GMT
ట్రావెన్ కోర్ కు కరోనా దెబ్బ ఎంతంటే.. తాకట్టులో స్వామి బంగారం
X
మాయదారి కరోనాతో దేశాలకు దేశాలే కిందామీదా పడిపోతున్న దుస్థితి. సంపన్న దేశాలు సైతం షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. కలలో కూడా ఊహించని పరిణామాలకు ఆయా దేశాల వారు తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఇలా దేశాలకు.. ప్రభుత్వాలకే కాదు.. పెద్ద పెద్ద అధ్యాత్మిక సంస్థలకు కరోనా ప్రభావం భారీగా పడుతోంది. ఆర్థికంగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. తాజాగా కేరళలో అత్యంత సంపన్న దేవస్థానాల్లో ఒకటైన ట్రావెన్ కోర్ దేవస్థానానికి కరోనా తిప్పలు తప్పటం లేదు.

దేశంలో అతి సంపన్నమైన దేవస్థానాల్లో తిరుమల శ్రీవారి ఆలయం.. కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం.. మహారాష్ట్రలో షిర్డీ సాయితోపాటు.. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం కూడా ఒకటి. కరోనా నేపథ్యంలో అయ్యప్ప ఆలయాల్ని చూసుకునే ట్రావెన్ కోర్ బోర్డుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతోంది. ఆ బోర్డు అధ్వర్యంలో 1247 ఆలయాలు నిర్వహిస్తున్నారు. అందులోని సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆలయాలకు వచ్చే భక్తులు పూర్తిగా తగ్గిపోవటంతో ఆదాయం అడుగంటింది. అదే సమయంలో ప్రతి నెల సిబ్బంది జీతాలతో పాటు.. ఆలయన నిర్వహణకుభారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో.. కిందామీదా పడే పరిస్థితి. ట్రావెన్ కోర్ బోర్డు విషయానికే వస్తే.. ప్రతి నెలా రూ.50 కోట్ల ఖర్చు ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధుల్ని ఇప్పటిదాకా సర్దుకొచ్చిన బోర్డుకు.. ఇప్పుడు నిధులు పూర్తి కావటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి.

దీంతో.. బోర్డు వద్ద ఉన్న బంగారు ఆభరణాలు.. నాణెలు కలిపి వెయ్యి కేజీల వరకు రిజర్వు బ్యాంకుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ వచ్చే నిధులతో బండి నడిపించాలన్న యోచనలో బోర్డు ఉంది. ఒక అంచనా ప్రకారం శబరిమల ఆలయానికి ప్రతి ఏటా 30 మిలియన్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో.. ఆలయానికి వచ్చే ఆదాయంతో పాటు.. కేరళ ప్రభుత్వానికి యాత్రికుల కారణంగా భారీగా రాబడి ఉండేది. ఇప్పుడు అది కూడా తగ్గిపోయే పరిస్థితి. కరోనా.. ఎంతపని చేస్తుందో కదా?