Begin typing your search above and press return to search.

లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి మృతిపై కుట్ర జ‌రిగిందా.!

By:  Tupaki Desk   |   26 Sep 2015 9:43 AM GMT
లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి మృతిపై కుట్ర జ‌రిగిందా.!
X
భార‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి మృతిపై ఆయ‌న కుమారుడు అనిల్ శాస్ర్తి ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌న తండ్రిది స‌హ‌జ‌మ‌ర‌ణం కాద‌ని...ఆయ‌న మృతి వెన‌క పెద్ద కుట్ర జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా నాటి సోవియ‌ట్ యూనియ‌న్‌లోని తాష్కెంట్‌ లో 1966 జ‌న‌వ‌రి 11వ తేదీన అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి చెందిన 50 సంవ‌త్స‌రాల‌కు ఇప్పుడు ఆయ‌న కుమారుడు చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు దేశ‌వ్యాప్తంగా పెద్ద‌దుమారం రేపాయి.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ర‌హ‌స్య ఫైళ్ల‌ను ప్ర‌భుత్వం బ‌య‌ట పెట్ట‌డంతో ఇప్పుడు త‌న తండ్రి మృతికి సంబంధించిన ఫైళ్ల‌ను కూడా ప్ర‌భుత్వం బ‌హిర్గ‌తం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. త‌న తండ్రి చ‌నిపోయిన వెంట‌నే ముఖం నీలం రంగులోకి మారిపోయింద‌ని ఆయ‌న చెపుతున్నారు. ఆయ‌న నివాసం ఉన్న గ‌దిలో డైరీ మాయ‌మైంద‌ని.... ఆ గ‌దిలో క‌నీసం టెలీఫోన్‌ - బెల్ కూడా లేవ‌ని...ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గురైన వెంట‌నే ప్రాథ‌మిక చికిత్స కూడా అంద‌లేద‌ని అనిల్ శాస్ర్తి ఆరోపించారు.

అప్ప‌ట్లో సోవియ‌ట్ యూనియ‌న్‌లోని భార‌త రాయ‌భార కార్యాల‌యం కూడా పూర్తి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న అన్నారు. లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి మ‌ర‌ణంపై విచార‌ణ క‌మిటీ చేయాల‌ని...ర‌హ‌స్యంగా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న ఫైళ్ల‌ను బ‌హిర్గ‌తం చేసి నిజా నిజాల‌ను వెల్ల‌డించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. త‌న తండ్రి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున భార‌త‌దేశ ప్ర‌ధానిగా ప‌నిచేస్తే ఆయ‌న కుమారుడు అనిల్ శాస్ర్తి బీజేపీలో ఉండ‌డం విశేషం. లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి మృతిచెందిన వెంట‌నే ఇందిరాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యారు. అప్ప‌ట్లోనే ఆయ‌న మృతిపై చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌ళ్లీ చాలా రోజులకు ఆయ‌న కుమారుడు శాస్ర్తీజీ మృతిప‌ట్ల సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌లు కాంగ్రెస్ పార్టీకి పెద్ద స‌వాల్ కానున్నాయి. వీటికి స‌మాధానం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఆ పార్టీకి ఎంతైనా ఉంద‌న్న చ‌ర్చ‌లు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి.