Begin typing your search above and press return to search.

చెన్నైలో ఆ ఇద్దరు అమ్మాయిల పెళ్లి.. ఇంట్లో వారి సమక్షంలో జరిగింది

By:  Tupaki Desk   |   3 Sep 2022 2:30 PM GMT
చెన్నైలో ఆ ఇద్దరు అమ్మాయిల పెళ్లి.. ఇంట్లో వారి సమక్షంలో జరిగింది
X
కాలానికి తగ్గట్లు కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినేందుకు కాస్తంత విచిత్రంగా ఉండొచ్చు కానీ.. ప్రాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా జరిగే స్వలింగ పెళ్లిళ్లు.. ఇటీవల కాలంలో మన దేశంలోనూ పెరుగుతున్నాయి. అబ్బాయికి అబ్బాయి.. అమ్మాయికి అమ్మాయితో జరుగుతున్న పెళ్లిళ్లు అక్కడక్కడ అడపాదడపా వింటుంటాం. అయితే.. వీటిని ఆయా కుటుంబాల వారు అస్సలు ఒప్పుకోకపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తాజాగా జరిగిన ఇద్దరు యువతుల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దక్షిణ భారతంలో సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారని చెప్పే తమిళనాడులో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేయటం ఒక ఎత్తు అయితే.. వారి పెళ్లిని ఇరు కుటుంబాల వారు దగ్గరుండి చేయించటం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పెళ్లిని తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం నిర్వహించటం అందరిని ఆకర్షిస్తోంది. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుబిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్ కు చెందిన టీనా దాస్.

ఆరేళ్ల క్రితం తామిద్దరం ప్రేమించుకున్నామని.. ఇరు కుటుంబాల వారిని ఒప్పించటానికి ఇంతకాలం పట్టిందని సుబిక్ష చెప్పారు. తామిద్దరి పెళ్లిని ఇరు కుటుంబాల్లోని వారు అంగీకరించి.. వారి సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన వైనంపై ఇరువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సీఏగా పని చేస్తున్న సుబిక్ష తాను బైసెక్సువల్ అని చెప్పేందుకు అస్సలు మొహమాటపడకపోవటం గమనార్హం. తన పందొమ్మిదేళ్ల వయసులోనే తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పానని వెల్లడించారు.

సుబిక్ష తల్లిదండ్రులు కల్గేరీలో ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. మధురైలో పెరిగిన ఆమె ఖతార్ లో కొన్నాళ్లు ఉన్నారు. కెనడాకు వెళ్లిన తర్వాత టీనాదాస్ తో పరిచయమైంది. ఇదిలా ఉంటే టీనా దాస్ విషయానికి వస్తే ఆమెకు 19 ఏళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కానీ.. నాలుగేళ్లకే ఆమె విడాకులు తీసుకున్నారు. సుబిక్షను కలవటం..

ఆ తర్వాత ఇద్దరి ఇష్టాయిష్టాలు కలవటం.. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని భావించినా.. ఇరు కుటుంబాల వారి అభ్యంతరాలతో ఇన్నాళ్లు ఆగిన వారు.. తాజాగా మాత్రం సంప్రదాయ పద్దతిలో.. తండ్రి ఒడిలో కూర్చొని మరీ వారి వివాహ మహోత్సవం జరగటం విశేషం. కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు మారుతున్నారనటానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.