Begin typing your search above and press return to search.

పాఠశాలలు తెరవకపోతే నిధులు ఆపేస్తా: ట్రంప్

By:  Tupaki Desk   |   9 July 2020 11:05 AM GMT
పాఠశాలలు తెరవకపోతే నిధులు ఆపేస్తా: ట్రంప్
X
ప్రపంచమంతా కరోనా పడగవిప్పుతోంది. అమెరికాలో అయితే జడలు విప్పి నాట్యమాడుతోంది. అక్కడ రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదై వందల్లో మరణిస్తున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు మాత్రం మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా వైరస్ వ్యాప్తి బాగా ఉండి కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాఠశాలలను తిరిగి తెరవాల్సిందేనని.. లేకపోతే స్కూళ్లకు నిధులు ఆపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పరిణామం విద్యావ్యవస్థపై, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. విద్యార్థులంతా స్కూళ్లకు వస్తే కరోనాకు ఎఫెక్ట్ అయ్యి అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నా ట్రంప్ ఇలా వ్యవహరించడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

పాఠశాలలను తిరిగి తెరవాలని అమెరికా సిడిసి మార్గదర్శకాలను జారీ చేసింది. కఠినమైన మార్గదర్శకాలపై ట్రంప్ ఇటీవలి ట్వీట్లలో సిడిసితో విభేదించారు. కొన్ని గంటల తరువాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పాఠశాలలను తిరిగి తెరవడానికి పాఠశాలలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రకటించారు. సీడీసీ మార్గదర్శకాల ప్రకారం పరిశుభ్రత, ముఖానికి మాస్క్. అవసరమైనప్పుడు ఇంట్లో ఉండటానికి నిర్ధేశించారు. బ్యాకప్ సిబ్బందిని నియమించారు. సామాజిక దూరం, భౌతిక అవరోధాలు మరియు మతపరమైన ప్రదేశాలను మూసివేయడాలు.. సవరించిన సీటింగ్ లేఅవుట్లు తప్పనిసరి చేశారు. సిడిసి జారీ చేసిన ప్రస్తుత మార్గదర్శకాలు పిల్లలను తిరిగి పాఠశాలలకు తీసుకురావడానికి కఠినమైనవి అని ట్రంప్ బహిరంగంగా చెప్పారు. అంతేకాదు.. పూర్తిగా తిరిగి తెరవడానికి నిరాకరించే పాఠశాలలకు నిధులను నిలిపివేస్తామని బెదిరించారు.

జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ మరియు అనేక ఇతర దేశాలలో పాఠశాలలను తెరిచారని.. అక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా నడుస్తున్నాయని.. నవంబర్ ఎన్నికలకు ముందు పాఠశాలలు తెరిస్తే రాజకీయంగా తమకు చెడ్డదని భావించే డెమొక్రాట్లు అడ్డుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు.

మరోవైపు, అంతర్జాతీయ విద్యార్థులను ట్రంప్ ఇంటికి పంపిస్తున్నారు. ఎఫ్1 వీసాలు రద్దు చేసి తిరిగి ఆయా దేశాలకు పంపేలా యుఎస్ ఇమ్మిగ్రేషన్ మార్గదర్శకాలు మార్చేశారు. వారు విశ్వవిద్యాలయాలలో ఆన్‌లైన్ లో మాత్రమే కోర్సులను ఎంచుకుంటే వారి దేశాలకు వెళ్లాల్సిందేనని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై విశ్వవిద్యాలయాలు కూడా ఖండించాయి.