Begin typing your search above and press return to search.

గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే ను కొట్టిన జనం !

By:  Tupaki Desk   |   30 April 2022 6:22 AM GMT
గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే ను కొట్టిన జనం !
X
అనూహ్య పరిణామానికి వేదికైంది ఏపీ. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై సొంత నియోజకవర్గంలోని వారు దాడి చేసిన ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఎవరికి ఎదురుకాని చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గ్రామాధ్యక్షుడు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేకు అనుహ్య పరిస్థితి ఎదురైంది.

అసలేం జరిగిందంటే..ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో గ్రామాధ్యక్షుడు, వైసీపీ నేత గంజి ప్రసాద్ ను ఆయన రాజకీయ ప్రత్యర్థులు అత్యంత దారుణంగా క్రూరంగా హత్య చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఈ నేపథ్యంలో గంజి ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లారు. అయితే.. హత్య ఉదంతంలో ఎమ్మెల్యే అనుచరుడు మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. గ్రామస్తులు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తమ నాయకుడ్ని అత్యంత క్రూరంగా హత్య చేసిన వైనంపై రగిలిపోతున్న గ్రామస్తులకు.. ఎమ్మెల్యే పరామర్శ మరింత రగిలిపోయేలా చేసింది. భద్రతా సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఏమవుతుందన్నది అర్థం కాని పరిస్థితి. భద్రతా సిబ్బంది ఎంతలా ప్రయత్నించినా గ్రామస్తుల ఆగ్రహం ముందు వారి బలం తేలిపోయింది.

దీంతో.. ఎమ్మెల్యే దాడికి గురయ్యారు. గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా గ్రామస్తులు దాడి చేశారు. మొత్తంగా గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యేను అతి కష్టమ్మీదా బయటకు తీసుకొచ్చారు.

ఈ ఉదంతం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఇంతకాలం వైసీపీ ప్రజాప్రతినిధులకు.. ఇతర పార్టీల వారికి లొల్లి జరిగితే.. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతల మధ్యనే దాడులు జరిగే పరిస్థితికి వెళ్లటం దేనికి నిదర్శనమన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.