Begin typing your search above and press return to search.

జంతువులకు కరోనా.. డబ్ల్యూహెచ్​వో హెచ్చరికలు

By:  Tupaki Desk   |   19 Nov 2020 10:50 AM GMT
జంతువులకు కరోనా..  డబ్ల్యూహెచ్​వో హెచ్చరికలు
X
మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా జంతువులకు కూడా సోకుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కరోనా గబ్బిలాల నుంచే వ్యాపించదన్న వాదనా ఉంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి భవిష్యత్​లో మరింత ప్రమాదంగా పరిణమించకుండా ఉండేందుకు డబ్ల్యూహెచ్​వో చర్యలు తీసుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా 500 రకాల జంతుజాతులపై పరిశీలన జరపాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం రెండు దశల ప్రణాళికలను తయారుచేసింది.

ఈ పరిశోధనల్లో 194 సభ్యదేశా లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులు, ప్యాంగోలిన్‌ (అలుగు)లలో కరోనా సారూప్య వైరస్‌లను అనేక పరిశోధనలు గుర్తించాయి. ముఖ్యంగా గబ్బిలాల్లో మార్చిలో గుర్తించిన ఆర్‌ ఏటీజీ13, ఆర్‌ ఎంవై?ఎన్‌02 జీనోమ్‌లలో సార్స్‌ కరోనా వైరస్‌తో 96.2, 93.3 శాతం సారూప్యత ఉందని నిర్ధారించారు. చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాల్లో కుక్కలు, పిల్లుల్లో, అమెరికాలోని ఓ జూలో పులులు, సింహాలకు కూడా ఈ వైరస్‌ సోకినట్టు తేలింది.

మానవులతో సన్నిహితంగా ఉంటే జంతువులకు కరోనా సోకితే చాలా ప్రమాదమని డబ్ల్యూహెచ్​వో హెచ్చరికలు జారీచేస్తున్నది. ఒకవేళ కరోనా మహమ్మారి జంతువులకు సోకితే తద్వారా అది మనుషులకు సోకే ప్రమాదమున్నదని.. కాబట్టి జంతువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్​వో పరిశోధనలు సాగిస్తున్నది. అయితే కోడి, బాతు, సీమకోడి వంటి జంతువుల వల్ల కరోనా సోకదని డబ్ల్యూహెచ్​వో మరోసారి స్పష్టం చేసింది.