Begin typing your search above and press return to search.

కరోనా పుట్టిందా.. పుట్టించారా? వచ్చేవారికి అడ్డంకులెందుకు?!

By:  Tupaki Desk   |   24 Dec 2020 11:30 PM GMT
కరోనా పుట్టిందా.. పుట్టించారా? వచ్చేవారికి అడ్డంకులెందుకు?!
X
కరోనా.. ఈ వైరస్ ధాటికి ప్రపంచం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకీడుస్తోంది. తాజాగా పుట్టుకొచ్చిన కరోనా స్ట్రెయిన్ తో మరింత ఆత్మరక్షణలో పడింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 8 కోట్ల మంది వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. ఇంతలా ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ వైరస్ చైనాలో పుట్టిందని అందరికీ తెలిసిందే. అయితే.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగానే వైరస్ కు ప్రాణం పోశారా? అనే చర్చ ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే.. ప్రస్తుతం చైనా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలో ఉన్న ఓ వైరాలజీ ల్యాబ్‌ లో ఈ వైరస్‌ పుట్టిందని ఇప్పటి వరకూ ప్రచారంలో ఉంది. అయితే.. దీన్ని తేల్చేందుకు జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణులు చైనా వెళ్లనున్నారు. అయితే.. ఇది జరగడానికి ముందే ఓ మీడియా సంస్థ అక్కడకు వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ.. అక్కడ వారికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలిసింది. దీంతో.. పరిశోధనాా కేంద్రానికి వెళ్లకుండానే సదరు మీడియా ప్రతినిధులు వెనుదిరిగారు.

ఏళ్లుగా పరిశోధనలు..
వుహాన్ నగరంలోని గబ్బిలాల్లో చాలా రకాల వైరస్ లు ఉన్నాయని సమాచారం. ఇందులో కొన్ని వైరస్ లు మనుషులకు వ్యాపిస్తాయట. ఈ వైరస్ లను గబ్బిలాల నుంచి సేకరించి వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. వుహాన్ కొండల్లో గబ్బిలాల నుంచి సేకరించిన వైరస్ లను దాదాపు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్న ల్యాబ్ కు తరలించి, అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వైరస్ ఈ ల్యాబ్ నుంచే పుట్టిందనే వాదన ఉంది. అయితే.. ఈ వాదనను ల్యాబ్ ప్రధాన సైంటిస్ట్, 56 ఏళ్ల ప్రొఫెస‌ర్ షీ జెంగ్లీ కొట్టి పడేస్తున్నారు.

డ‌బ్ల్యూహెచ్‌వోకు స్వాగతం...
తమ ల్యాబ్ నుంచి వైరస్ పుట్టలేదంటున్న జెంగ్లీ.. పరిశీలన కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెబుతున్నారు. అయితే.. బహిరంగంగా, పారదర్శకంగా సహేతుకమైన సంభాషణల ద్వారా సాగే ఎలాంటి సందర్శననైనా తాము స్వాగతిస్తామని చెబుతున్నారు ప్రొఫెసర్ జెంగ్లీ. కానీ.. దానికి సంబంధించిన ప్రణాళిక మాత్రం తన చేతుల్లో లేదని అంటున్నారు. అంటే.. దేశం అంగీకరించాలనేది ఆమె అంతరార్థం.

మీడియాకు ఎందుకు నో ఎంట్రీ?
అయితే.. మీడియాకు మాత్రం చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. వుహాన్ ల్యాబ్ ను సందర్శించేందుకు అంతర్జాతీయ మీడియాకు పర్మిషన్ ఇవ్వట్లేదు చైనా. దీంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఎలాంటి తప్పులూ చేయనప్పుడు మీడియాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవాలు బయటపడతాయనే జర్నలిస్టులను రానివ్వట్లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

డబ్ల్యూహెచ్ వో ఏం చేస్తుందో?
త్వరలో డబ్ల్యూహెచ్ వో బృందం యూనాన్ ప్రావిన్సులో ఉన్న వైరాలజీ ల్యాబ్ కు వెళ్లనుంది. అయితే.. ఎంత మేర వాస్తవాల్ని ఈ బృందం సభ్యులు వెలికి తీస్తారు? అన్న సందేహం వ్యక్తమవుతోంది. చైనా తీరు చూస్తుంటే.. వైరస్ పుట్టుకకు సంబంధించిన వివరాలు ఏవీ పూర్తిగా బయటి ప్రపంచానికి తెలియకూడదని భావిస్తున్నట్టుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి ఇటీవల వెళ్లిన మీడియా సంస్థను అడ్డకున్న అధికారులు.. వారిని ఎలాంటి దృశ్యాలూ రికార్డు చేయకుండా అడ్డుకున్నారని సమాచారం. మరి, ఇలాంటి పరిస్థితుల్లో చైనా వెళ్లనున్న డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు ఏం తేలుస్తారనేది ఉత్కంఠగా మారింది.