Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే సోదరి ఫ్యామిలీ మొత్తం అనుమానస్పద మృతి

By:  Tupaki Desk   |   17 Feb 2020 8:45 AM GMT
ఎమ్మెల్యే సోదరి ఫ్యామిలీ మొత్తం అనుమానస్పద మృతి
X
ఆయనో ఎమ్మెల్యే. ఆయన సోదరి.. ఆమె భర్త.. కుమార్తె గడిచిన ఇరవై రోజులుగా అందుబాటులో లేరు. తరచూ ప్రయాణాలకు వెళ్లే వారు.. ఎక్కడికో వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఇలాంటివేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఒక రోడ్డు యాక్సిడెంట్.. కనిపించకుండా పోయిన వారి ఆచూకీ తెలిసేలా చేసింది. షాక్ కు గురి చేసింది. అప్పటివరకూ వారు ఏదో ఊరికి వెళ్లి ఉంటారనుకున్న దానికి భిన్నంగా ఎప్పటికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్నది నమ్మశక్యం కాని రీతిలో మారింది. పెనుసంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక.. ఆమె భర్త.. కుమార్తెలు అనుమానాస్పదంగా మరణించిన తీరు షాకింగ్ గా మారింది. ఆదివారం సాయంత్రం బైక్ మీద వెళుతున్న ఒక జంట ప్రమాదవశాత్తు కాలువలో పడ్డారు. దీంతో.. కాలువకు నీటిని నిలిపివేశారు. ఇలాంటివేళ.. కాలువలో ఒక కారు కనిపించటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

క్రేన్ సాయం తో కారు బయటకు తీశారు. నెంబరు ఆధారంగా కారు యజమాని ఎవరో గుర్తించే ప్రయత్నం చేయగా.. ఆ కారులో ఉన్నది పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి.. ఆమె కుటుంబ సభ్యులన్న విషయాన్ని గుర్తించారు. ఇరవై రోజుల క్రితం కనిపించకుండా పోయిన వారు.. ఇలా నిర్జీవంగా.. గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. ఇన్నిరోజుల పాటు నీటిలో ఉండిపోవటంతో మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి.

ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మనోహర్.. కలెక్టర్.. సీపీ కమల్ హాసన్ రెడ్డి లు కాలువ వద్దకు చేరుకున్నారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. వారు తరచూ విహారయాత్రలకు వెళ్లి వస్తుంటారన్నారు. గడిచిన ఇరవై రోజులుగా వారితో తమకు కమ్యునికేషన్ లేదని.. అయినప్పటికీ తమకు అనుమానం రాలేదన్నారు. ఈ ఉదంతం పై పూర్తి విచారణ చేసిన తర్వాత అన్ని వివరాలు బయటకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం ఎక్కడికో వెళ్లారనుకున్న వారు.. మరణించిన దశలో కనిపించటం పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.