Begin typing your search above and press return to search.

ఆ మహిళను టీఆర్ఎస్ కార్పొరేటర్ అత్యాచారం చేశారట

By:  Tupaki Desk   |   2 May 2021 7:30 AM GMT
ఆ మహిళను టీఆర్ఎస్ కార్పొరేటర్ అత్యాచారం చేశారట
X
దారుణమైన ఆరోపణను ఎదుర్కొంటున్నారు తెలంగాణ అధికారపార్టీకి చెందిన ఒక కార్పొరేటర్. హైదరాబాద్ మహానగర శివారులో ఉండే జవహర్ నగర్ కార్పొరేషన్లో ఆరో నెంబరు కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు పల్లపు రవి. ఒక దళిత మహిళపై ఇంటికెళ్లి మరీ అత్యాచారం చేసినట్లుగా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. ఒక మహిళ స్థానిక పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ కాపీతో ఈ ఉదంతం తెర మీదకు వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న తమ ఇంటికి వచ్చిన కార్పొరేటర్ పల్లపు రవి.. తనను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లుగా బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లుగా వాపోయింది. ఇంతకీ బాధిత మహిళకు.. కార్పొరేటర్ కు పరిచయం ఎలా జరిగింది?ఆమె ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? అన్న సందేహాలు రాక మానవు.

బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్ని పోలీసులు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ఒక జంట 115 గజాల స్థలాన్ని పల్లపు రవి వద్ద నోటరీ ద్వారా కొనుగోలు చేశారు. అదే స్థలంలో రేకుల గదులు నిర్మించేందుకు రూ.2లక్షలతో రవితో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందుకు అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటి పనులు జరుగుతున్న వైనాన్ని చూసేందుకు ఇంటికి వచ్చిన రవి.. బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి నుంచి తప్పించుకునేందుకు తాను ఎంతగానో ప్రతిఘటించానని.. ఆ సమయంలో తనను బలవంతంగా ఎత్తుకెళ్లి నిర్మాణంలో బెడ్రూంలో లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపించారు.

తనపై జరిగిన దాడి అనంతరం బాధితురాలు ఏడ్చుకుంటూ బీజేపీఆర్ నగర్ బస్టాప్ వైపు వెళ్లగా.. అక్కడకు వెళ్లిన రవి.. ఈ వ్యవహారాన్ని అక్కడితో ముగించాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యకు జరిగిన దారుణం గురించి తెలుసుకున్న భర్త.. ఆమెను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అధికార పార్టీ నేత తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.