Begin typing your search above and press return to search.

జగన్ కు ఆయుధంగా మారిన బాబునోటి నుంచి వచ్చిన మాట

By:  Tupaki Desk   |   19 Sep 2022 3:30 PM GMT
జగన్ కు ఆయుధంగా మారిన బాబునోటి నుంచి వచ్చిన మాట
X
కొన్నిసార్లు అంతే. నోట్లో నుంచి వచ్చే ఎన్నో మాటలకు విలువ ఉండదు కానీ.. తేడాగా చెప్పే ఒకే ఒక్క మాటతో జరిగే నష్టం భారీగా ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు అమరావతి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయుధంగా మారింది. అమరావతి కల కన్నది.. దాని కోసం అలుపుసొలుపు లేకుండా పరుగులు తీసిన చంద్రబాబు.. అమరావతిని మరింత ఉన్నతంగా చూపించాలన్న ఆత్రుత అమరావతికి శాపంగా మారిందా? అంటే కొంత మేర అవునని చెప్పాలి.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఏపీ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు కమిట్ మెంట్ ను వీసమెత్తు కూడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పొలిటికల్ కెరీర్ లో తప్పులు చేసి ఉండొచ్చు. అధికారం కోసం ఎత్తులు వేసి ఉండొచ్చు. కానీ.. విభజనకు తాను కూడా కారణమని ఫీలైన చంద్రబాబు.. తన కారణంగా తన సొంత రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న వేదన ఉందని చెబుతారు.
సాధారణంగా సొంత ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పాలకులకు భిన్నంగా..

హైదరాబాద్ ను ముస్తాబు చేసి.. తెలుగు ప్రజలకు గుండెకాయలా మార్చటమే కాదు.. దాని చుట్టూనే తెలుగోది ఎదుగుదల ఉండేలా ప్లాన్ చేసిన ఆయన.. విభజన నేపథ్యంలో ఏపీకి ఏమీ చేయలేకపోయానన్న వేదన ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. అందుకే.. ఏపీ ప్రజలు దేనిలోనూ తక్కువ కాదన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న కసితో మొదలు పెట్టిందే అమరావతి అని చెబుతారు.

అమరావతిని విజయవాడ- గుంటూరు మధ్యన ఏర్పాటు చేస్తే.. రాబోయే రోజుల్లో అటు ఏలూరు నుంచి ఇటు చీరాల వరకు విస్తరించుకుంటూ పోయి.. హైదరాబాద్ మాదిరిమరో మహా నగరంగా మారాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఈ ఆత్రుతలో ఆయన చేసిన తప్పు ఏదైనా ఉందంటే.. అమరావతి ప్రాంతంలో తాను నిర్మించిన భారీ భవనాలన్నింటిని తాత్కాలిక భవనాలుగా పేర్కొనటమే.
బ్రహ్మండంగా సిద్ధం చేసిన అసెంబ్లీ భవనంతో పాటు..

సచివాలయ భవనాన్ని సైతం తాత్కాలిక భవనంగా పేర్కొనటం తెలిసిందే. ఇంత బాగా నిర్మించిన తర్వాత కూడా తాత్కాలిక భవనాలుగా ఎందుకు అబివర్ణిస్తున్నట్లు అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తే.. తెలుగు తమ్ముళ్ల నుంచి వచ్చే సమాధానం.. 'దీనికి మించిన భవనాల్ని నిర్మించి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయటం కోసమే తాత్కాలిక భవనాలు అంటున్నాం. అంతే తప్పించి.. ఇవేమీ టెంపరరీ భవనాలు కావు. సీడ్ క్యాపిటల్ లో కళ్లు చెదిరేలా నిర్మాణాల్ని చేపట్టటానికి కొన్నేళ్లు పడుతుంది. అంతలోపు వీటిని వాడుకోవాలన్నదే చంద్రబాబు కోరిక' అని చెప్పేవారు.

మామూలుగా అయితే.. నాలుగైదు భవనాల్ని నిర్మించేసి.. రాజధాని రెఢీ అన్నట్లు కాకుండా.. కలల రాజధానిని ఏర్పాటు చేయాలన్న ఆత్రుత.. దాన్ని భారీగా సిద్ధం చేయాలనే ఆశ.. ఇవాల్టి రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయుధాలుగామారాయని చెబుతున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన భవనాలన్ని తాత్కాలిక భవనాలే అంటూ జగన్ నోటి నుంచి వస్తున్న మాటల్ని చూసినప్పుడు.. ఆ అవకాశం చంద్రబాబే ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. నిజమే.. అమరావతికి మంచి చేయాలన్న ఉద్దేశంతో తాత్కాలికమన్న మాట బాబు నోటి నుంచి వస్తే.. అమరావతి సంగతి తేలుద్దామన్న పట్టుదలతో ఉన్న జగన్.. తాత్కాలిక భవనాలను తనదైన కోణంలో చూడటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టం అన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.