Begin typing your search above and press return to search.

నివురుగప్పిన నిప్పులా పల్నాడు.. కొత్త జిల్లా రగడే కారణమా?

By:  Tupaki Desk   |   15 Nov 2020 4:00 PM GMT
నివురుగప్పిన నిప్పులా పల్నాడు.. కొత్త జిల్లా రగడే కారణమా?
X
పాదయాత్ర సందర్భంలోనూ.. ఎన్నికల ప్రచార సమయంలోనూ.. తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. అందుకు తగ్గట్లే అధికారంలోకి వచ్చినంతనే కొత్త జిల్లాలపై కసరత్తు షురూ చేశారు. అయితే.. పల్నాడు జిల్లా విషయంలో ఇప్పుడో రగడ షురూ అయ్యింది. గుంటూరు జిల్లాను మూడుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న గుంటూరు కాకుండా.. బాపట్లను ఒక జిల్లాగా.. నరసరావుపేటను పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జగన్ సర్కారు ఉన్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ఎంపిక చేయటాన్ని తప్పు పడుతున్నారు. పల్నాడు చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఏ విధంగా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పల్నాడు వాసులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం అక్కడ నివురుగప్పిన నిప్పులా పరిస్తితి ఉందంటున్నారు.

నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే.. ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు పల్నాడు ప్రాంత ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సాధన సమితి ఆందోళన బాట పట్టటం గమనార్హం. ఇదిలా ఉంటే.. అధికారపక్ష నేతలు మాత్రం నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటానికి మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పల్నాడు ప్రజలు మాత్రం గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటున్నారు.

పల్నాడు ప్రాంతానికి చెందిన అధికారపక్ష ఎమ్మెల్యేల్లో ఒక్కరు తప్పించి మిగిలిన వారంతా కూడా నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం.. డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కార్యాలయంగా మార్చాలని భావిస్తున్నారు. కొత్త జిల్లా కింద 28 మండలాలు రానున్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలోని చిలకలూరిపేట.. నరసరావుపేట.. సత్తెనపల్లి.. పెదకూరపాడు.. వినుకొండ.. గురజాల.. మాచర్ల అసెంబ్లీ సిగ్మెంట్లు రానున్నాయి. ఇవన్నీ పల్నాడు జిల్లాకు రానున్నాయి.

ఇక పురపాలక సంఘాల్లో నరసరావుపేట.. చిలకలూరిపేట.. వినుకొండ.. సత్తెనపల్లి.. పిడుగురాళ్ళ ఉన్నాయి. గురజాల.. దాచేపల్లి ప్రాంతాలు నగర పంచాయితీలుగా ఉన్నాయి. కొత్త జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ఏర్పాటు చేయనున్నారన్న మాటతో.. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్.. విజయవాడ నగరాల కంటే ఎక్కువ ధరలు అక్కడ పలకటం విశేషం. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రేపొద్దున జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత భూముల ధరలు మరెంతలా మారిపోతాయో?