Begin typing your search above and press return to search.

ప్రేమించలేదని బీటెక్ విద్యార్థిని కత్తితో నరికి చంపేసిన యువకుడు !

By:  Tupaki Desk   |   15 Oct 2020 2:30 PM GMT
ప్రేమించలేదని బీటెక్ విద్యార్థిని కత్తితో నరికి చంపేసిన యువకుడు !
X
విజయవాడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించట్లేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆపై తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజపురంకు చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువు కుంటుంది.

అయితే , స్థానికంగా ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో కోపోద్రేకుడైన స్వామి కత్తితో యువతి పై దాడి చేశారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

యువతిని కత్తితో పొడిచిన తర్వాత నిందుతుడు కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం నిందితుడు స్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన విజయవాడ మహిళా సంఘం నాయకురాలు దుర్గా భవాని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడితో మరోసారి విజయవాడ నగరం ఉలిక్కిపడిందన్నారు. ఇంటికొచ్చి మరీ యువతిపై దాడి చేశాడంటే, తననెవరూ ఏమీ చేయలేరన్న మనస్తత్వమైనా ఉండాలి లేదా వెనకాల ఎవరి అండదండలైనా ఉండి ఉండాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.