Begin typing your search above and press return to search.

నాడు జీవీఎల్‌.. నేడు ల‌గ‌డ‌పాటి!

By:  Tupaki Desk   |   6 Dec 2018 5:42 AM GMT
నాడు జీవీఎల్‌.. నేడు ల‌గ‌డ‌పాటి!
X
అది 2004. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క ఎన్నిక‌లు. నారా చంద్ర‌బాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ మ‌ళ్లీ అధికారం చేప‌ట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. నాడు చంద్ర‌బాబుకు ప్ర‌ధాన అడ్డంకి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రమంత‌టా పాద‌యాత్ర నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై.. వారి క‌ష్టాలు తెలుసుకొని వైఎస్ జోరు మీదున్నారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త కూడా ఆయ‌న‌కు క‌లిసొస్తుంద‌ని అంతా అనుకున్నారు.

ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్ న‌ర‌సింహారావు అప్ప‌ట్లో ఓ స‌ర్వే నిర్వ‌హించారు. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ విజ‌యం ఖాయ‌మ‌ని అంచ‌నా వేసిన వారంతా ఆ స‌ర్వే ఫ‌లితాలు చూసి నివ్వెర పోయారు. అఖండ మెజారిటీతో మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డ‌మే అందుకు కార‌ణం.

2004లో జీవీఎల్‌ స‌ర్వే మొద‌టి విడ‌త ఫ‌లితాలు టీడీపీకి సానుకూలంగా వ‌చ్చాయి. వాటిని చూసి ప్ర‌జ‌లు పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోలేదు. ఆ త‌ర్వాత జ‌నం నాడి వేగంగా మారింది. పాద‌యాత్ర‌తో వైఎస్ గ్రాఫ్ బాగా పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపించింది. జీవీఎల్ చేయించిన‌ రెండో విడ‌త స‌ర్వేలో ఈ విష‌యం తేలింద‌ట‌.

కానీ - అక్క‌డే చంద్ర‌బాబు నాయుడు రంగ ప్ర‌వేశం చేశార‌ట. స‌ర్వే ఫ‌లితాలు వ్య‌తిరేకంగా బ‌య‌ట‌కు వ‌స్తే పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంద‌ని భావించార‌ట‌. అందుకే జీవీఎల్‌ణు మేనేజ్ చేశార‌ట‌. మొద‌టి విడ‌త ఫ‌లితాల‌నే మొత్తం రెండు విడ‌త‌ల ఫ‌లితాలుగా ప్రొజెక్ట్ చేయించార‌ట‌. త‌న అనుకూల మీడియాలో వార్త‌లు వేయించార‌ట‌. ఇంకేముందు అప్పుడు టీడీపీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ క‌నిపించింద‌ట‌. టీడీపీ 181 సీట్లు చేజిక్కించుకొని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తుంద‌ని స‌ర్వే చెప్పింద‌ట‌. అయితే - ఆ బూట‌క‌పు స‌ర్వే ఫ‌లితాల తెర వెనుక న‌డిచిన క‌థ‌ను అర్థం చేసుకున్న ఓట‌ర్లు.. టీడీపీని 2004లో గ‌ట్టి దెబ్బ‌కొట్టి కాంగ్రెస్‌కు భారీ విజ‌యాన్ని అందించారు. చంద్ర‌బాబు పార్టీ కేవ‌లం 47 సీట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఇప్పుడు కూడా తెలంగాణ‌లో స‌రిగ్గా అదే జ‌రుగుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై ఒత్తిడి పెంచి ఆయ‌న స‌ర్వే ఫ‌లితాల‌ను చంద్ర‌బాబు తారుమారు చేశార‌ని భావిస్తున్నారు. ఆయ‌న కుట్ర‌ను తెలంగాణ ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌బోర‌ని అంటున్నారు. చంద్ర‌బాబు ఎత్తుల్ని చిత్తు చేస్తూ టీఆర్ఎస్‌కు ఓట‌ర్లు ప‌ట్టం క‌డ‌తార‌ని సూచిస్తున్నారు.