Begin typing your search above and press return to search.

అప్పుడేమో ఉచితం.. ఇప్పుడు మాత్రం ఖర్చు ఎంతంటే?

By:  Tupaki Desk   |   1 Nov 2020 8:30 AM GMT
అప్పుడేమో ఉచితం.. ఇప్పుడు మాత్రం ఖర్చు ఎంతంటే?
X
రిజిస్ట్రేషన్ విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ధరణి పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావటం తెలిసిందే. రిజిస్ట్రేషన్ తో పాటు భూ హక్కు మార్పిడి ఒకేసారి పూర్తి చేసే ధరణి పోర్టల్ తో అప్పటికప్పుడు మ్యుటేషన్ పూర్తి కానుంది. అయితే.. ఇందుకోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఉచితంగా అందే ఈ సేవల్ని ఇప్పుడు మాత్రం ఎకరానికి రూ.2500 చొప్పున చెల్లించాలని పేర్కొంది.

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు.. మ్యుటేషన్ల సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు మాన్యువల్ పద్దతిలో భూ యాజమాన్య హక్కును మార్పులు చేసి హక్కు పత్రాల్ని అందించేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం.. డిజిటల్ రూపంలో అందజేయనున్నారు. ఇందుకోసం నిర్ణయించిన ఛార్జీలు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు.

గతంలో ఏదైనా భూమిని అమ్మాలనుకుంటే రిజిస్ట్రేషన్ కు స్టాంపు రుసుము.. చలానా రూపంలో చెల్లించాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక తహసీల్దారు కార్యాలయంలో 1బి రికార్డుల్లోయాజమాన్య హక్కుల మార్పిడి ఉచితంగా అందించేవారు. పాసుపుస్తకం లేని రైతులకు కొత్త పుస్తకం జారీ కోసం నామమాత్రపు రుసును వసూలు చేసేవారు. తాజాగా వచ్చిన ధరణిలోనూ మిగిలిన చార్జీల్లో మార్పులు లేవు. కానీ.. మ్యుటేషన్ కు మాత్రం ఎకరానికి రూ.2500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అమ్మకాలకు మాత్రమే కాదు.. గిఫ్టుగా ఇచ్చినా.. తాకట్టు.. భూహక్కుల బదిలీ.. వారసత్వ పంపిణీ.. ఇలా లావాదేవీ ఏదైనా సరే.. మ్యుటేషన్ కు చార్జీల్ని వసూలు చేస్తారు.

అంతేకాదు.. ధరణి సేవల్ని పొందేందుకు నిర్వహణ ఛార్జీల కింద రూ.425 చెల్లించాల్సి ఉంటుంది. పోర్టల్ ద్వారా తహసీల్దారు కార్యాలయంలో ఏ సేవలు పొందినా.. ఈ మొత్తాన్ని చెల్లించక తప్పదు. అంతేకాదు.. భూమి కొన్న వారికి ఇచ్చే పాసుపుస్తకం జారీ చేయటానికి రూ.300 ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ.. అప్పటికే పాసు పుస్తకం ఉండి ఉంటే మాత్రం ఎలాంటి ఛార్జీని వసూలు చేయరు. పాసు పుస్తకం.. ఇతరత్రా పత్రాల్ని కొరియర్ ద్వారా పంపేందుకు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.తాజాగా తీసుకొచ్చిన ధరణి పుణ్యమా అని.. మ్యుటేషన్ కింద ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్ల మొత్తం అదనపు ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. ధరణి కారణంగా సర్కారుకు కూడా డబ్బులు భారీగానే వస్తున్నాయిగా.