Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో ఓటుకు నోటు.. ఇప్పుడు.. ఎమ్మెల్యేల‌కు కోట్లు.. గెయినెవ‌రికి బ్రో!!

By:  Tupaki Desk   |   27 Oct 2022 9:10 AM GMT
అప్ప‌ట్లో ఓటుకు నోటు.. ఇప్పుడు.. ఎమ్మెల్యేల‌కు కోట్లు.. గెయినెవ‌రికి బ్రో!!
X
రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు భిన్నంగా సాగుతున్నాయి. ఏపీలో నేత‌లు ఒక‌రిపై ఒక‌రు.. దుమ్మెత్తి పోసుకుని.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకుని.. రోడ్డున ప‌డుతుండ‌గా.. తెలంగాణ‌లో వీటితోపాటు.. డ‌బ్బు రాజ‌కీయాలు.. కూడా పాలిటిక్స్‌ను కుదిపేస్తున్నాయి. ఎమ్మెల్యేల‌కు ఎర‌వేయ‌డం.. ఇక్క‌డ సంప్ర‌దాయంగా మారుతోందా? అనే ప్ర‌శ్న ఉద‌యించేలా ప‌రిస్థితి మారిపోయింది. తాజా తీవ్ర సంచ‌ల‌నం రేపిన ఫామ్ హౌజ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? రాజ‌కీయాలు ఇంత‌గా దిగ‌జారిపోయాయా? ఈ ప‌రిణామాలు.. ఎవ‌రికి ల‌బ్ధిని చేకూర్చుతాయి? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ప‌రిణామాలు తీసుకుంటే.. కేసీఆర్ హ‌యాంలోనే.. 2016లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ స‌న్‌ను త‌మ‌కు అనుకూలంగా ఓటు వేయాల‌ని కోరుతూ.. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. బేరాలు ఆడార‌నే వీడియోలు వెలుగు చూశాయి. అప్ప‌ట్లో ఈయ‌న టీడీపీ నాయ‌కుడిగా ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చంద్ర‌బాబు చేశార‌ని అన్న‌ట్టుగా.. ఉన్న 'బ్రీఫ్‌డ్ మీ' వ్యాఖ్య‌లు.. తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీశాయి. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు రాత్రికి రాత్రి హైద‌రాబాద్ నుంచి ఉండ‌వ‌ల్లికి వ‌చ్చేయ‌డం తెలిసిందే.

ఇక‌, ఆ క్ర‌మంలో అప్ప‌టి ఎపిసోడ్‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ.. బాగానే ల‌బ్ధి పొందింది. దీనిని కూడా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో కేసీఆర్ విజ‌యం సాధించారు. త‌ర్వాత‌.. వ‌చ్చిన ఎన్నిక‌ల్లో.. ఆయ‌న దీనిని అస్త్రంగా మార్చుకోవ‌డ‌మే కాకుండా.. టీడీపీ అంతో ఇంతో బ‌లంగా ఉన్న చోట దానిని బ‌ల‌హీన‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించారనే టాక్ ఉంది. అంతేకాదు.. ఆ త‌ర్వాత‌.. పోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కూడా.. తెర‌మీదికి వ‌చ్చింది. ఇరు రాష్ట్రాల మంత్రుల‌పైనా కేసులు కూడా.. న‌మోదు చేసుకునే ప‌రిస్థితి రావ‌డం.. కేటీఆర్‌పై కేసు పెడ‌తాన‌ని.. చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం.. ఇలా.. అప్ప‌ట్లో ఒక రాజ‌కీయ స‌మ‌ర‌మే జ‌రిగిపోయింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. మ‌ళ్లీ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ తెర‌మీదికి వ‌చ్చింది. స‌రిగ్గా మునుగోడు ఉప ఎన్నిక కీల‌కంగా మారి.. హోరాహోరీగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు.. బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నించార‌ని.. దీనికి సంబంధించి 400 కోట్ల రూపాయ‌ల డీల్ కూడా కుదిరింద‌ని.. పెద్ద ఎత్తున పోలీసులు దాడులు చేసి.. మధ్య‌వ‌ర్తుల‌ను కూడా.. అదుపులోకి తీసుకోవ‌డం.. పెను సంచ‌ల‌నంగా మారింది. దీనిపై అటు టీఆర్ ఎస్‌.. ఇటు బీజేపీలు.. ప‌ర‌స్ప‌రం నిప్పులు చెరుగుకున్నారు. అయితే.. ఈ ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎలాంటి త‌ప్పు చేశార‌నేది త్వ‌ర‌లోనే తేలుతుంది.

కానీ, ఇక్క‌డ ధ‌ర్మ సందేహం ఏంటంటే.. ఈ ఎపిసోడ్ ఎవ‌రికి ల‌బ్ధి చేకూర్చుతుంది. ఇక్క‌డ‌.. ఈ కోట్ల రూపాయ‌ల ముడుపులు వాస్త‌వ‌మే అయితే.. ఖ‌చ్చితంగా.. బీజేపీని రోడ్డున ప‌డేసి.. చెడుగుడు ఆడేందుకు. కేసీఆర్ రెడీ అయిపోతారు. ఈ క్ర‌మంలో కేసులు కూడా.. పెట్టే యోచ‌న చేయొచ్చు. త‌ద్వారా.. సెంటిమెంటును మ‌రోసారి ర‌గిలించి.. బీజేపీని దుయ్య‌బ‌ట్టే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. అయితే.. బీజేపీ నేత‌లు మాత్రం.. తాము.. చేయాల‌ని అనుకుంటే.. టీఆర్ ఎస్‌కు చెందిన ఫామ్ హౌజ్‌లో ఎందుకు చేస్తామ‌ని.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. అస‌లు కేసు వెలుగు చూశాక‌.. ఎమ్మెల్యేల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు తీసుకువెళ్ల‌డం ఏంట‌నేది.. వారి ప్ర‌శ్న‌. మొత్తంగా..చూస్తే.. గ‌తంలో ఓటుకునోటు.. ఇప్పుడు.. ఎమ్మెల్యేల‌కు కోట్లు ఎపిసోడ్ రంజుగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.